డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన సినిమాలో హీరోకి డిజైన్ చేసే పాత్ర ప్రేక్షకులకి టక్కున కనెక్ట్ అయిపోతుంది. తను ఎంపిక చేసుకునే ప్రతి హీరో అభిమానులు కొత్తగా ఫీల్ అయ్యేలా ఏదో ఒకటి డిజైన్ చేస్తాడు. పూరి మొదటి సారి యంగ్ హీరో నితిన్ తో కలిసి చేసిన సినిమా ‘హార్ట్ ఎటాక్’. ఈ సినిమా ఆడియో ఇటీవలే బ్యాంకాక్లో విడుదలైంది. సీడీలు ఈ రోజు నుంచి మార్కెట్ లో దొరకనున్నాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. కానీ ఎప్పుడు కలిసి పనిచేయలేదు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేస్తున్నానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది. అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ కి థాంక్స్’ అని అన్నాడు.
నితిన్,ఆద శర్మ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.