సుధీర్ కి అంతకు మించి నేనేమీ చేయలేదు – మహేష్ బాబు

సుధీర్ కి అంతకు మించి నేనేమీ చేయలేదు – మహేష్ బాబు

Published on Oct 31, 2013 8:48 AM IST

Aadu-Magadura-Bujji-Audio-L
సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన హీరో సుధీర్ బాబు. ఇటీవలే ‘ప్రేమ కథా చిత్రమ్’ తో విజయాన్ని అందుకున్న సుధీర్ బాబు త్వరలోనే ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకి సూపర్ స్టార్ మహేష్ బాబు, కృష్ణ, విజయ నిర్మల ముఖ్య అతిధులుగా విచ్చేశారు.

ఈ వేడుకలో సుధీర్ బాబు మాట్లాడుతూ ‘ మామయ్యా కృష్ణ గారిని ఎప్పుడు ఏది అడిగినా సరే అంటారు. అదే మహేష్ బాబుని అడిగితే కాస్త ఆలోచిస్తారు. ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. అలాగే అవసరమైతే కోటి రూపాయలన్నా ఇస్తారు గానీ సిఫారసు మాత్రం చేయరు. అర్హత లేని వారికి అసలు సహకారం అందించరు. నాకు మహేష్ బాబు అందిస్తున్న ప్రోత్సాహం వెలకట్టలేనిది. ఆయనే నాకు స్ఫూర్తి’ అని అన్నాడు.

మహేష్ బాబు మాట్లాడుతూ ‘ సుధీర్ ఎప్పుడు నేను ప్రోత్సహించానని చెబుతుంటాడు. చెప్పాలంటే ఇలా ఆడియో వేడుకలకి రావడం తప్ప నేను తనకి చేసింది ఏమీ లేదు. తను ఎవరి సహాయం లేకుండా నిలదొక్కుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా కూడా ప్రేమ కథా చిత్రమ్ అంత పెద్ద హిట్ అవ్వాలి. ‘1-నేనొక్కడినే సినిమా జనవరి 10న విడుదలవుతుంది. చూసి ఎంజాయ్ చెయ్యండని’ అన్నారు.

తాజా వార్తలు