రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అక్కినేని వారసుడు సుమంత్. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్నిఅందుకుంది. కాగా సత్యం, గౌరీ చిత్రాలు సుమంత్ కి మంచి బ్రేక్ ఇచ్చాయి. ఐతే ఆ తరువాత ఆయన నటించిన అనేక చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీనితో 30 సినిమాలకు పైగా చేసినా సుమంత్ హీరోగా నిలబడలేకపోయారు. హీరోగా తను ఓ ఇమేజ్ తెచ్చుకోలేకపోవడానికి తన తీసుకున్న తప్పుడు నిర్ణయాలే అని సుమంత్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
మామయ్య నాగార్జునతో కలిసి చేసిన స్నేహమంటే ఇదేరా మూవీ కూడా అలాంటిదే అన్నారు. మలయాళ హిట్ మూవీ ఫ్రెండ్స్ ని తమిళంలో హీరో విజయ్, సూర్య రీమేక్ చేసి హిట్ కొట్టారు. అదే సినిమాను తెలుగులో నాగార్జున, సుమంత్ స్నేహమంటే ఇదేరా అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఆ మూవీ గురించి మాట్లాడుతూ…ఆ సినిమాలో మామయ్య నాగార్జునను నేను కొట్టే సన్నివేశం ఉంటుంది, అప్పడు నాకు అదోలా అనిపించింది. అప్పుడే ఈ సినిమా ప్లాప్ అవుతుందని అనిపించింది. కానీ తప్పక చేశాను. మా ఇద్దరిని ప్రేక్షకులు స్నేహితులుగా ఒప్పుకోలేదు. అలాగే నేను ఆయన్ని కొట్టడం కూడా ప్రేక్షకులకు నచ్చి ఉండదు. ఇలాంటి సినిమాల ఎంపిక వలన కెరీర్ గాడిన పడలేదు అని అన్నారు.