సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు సక్సెస్.. ఇక షూటింగ్స్ షురూ..!

గత 18 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె చివరికి పరిష్కారం దిశగా అడుగుపెట్టింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ప్రభుత్వం, ఫిల్మ్ ఇండస్ట్రీ, కార్మిక ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో రేపటి నుంచి అన్ని సినిమా షూటింగ్స్ పునః ప్రారంభం కానున్నాయి.

ఎఫ్‌డిసి అధ్యక్షుడు దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా పరిష్కారం తీసుకురావాలని మేము కోరాం. ఆయన వెంటనే స్పందించి సమస్యను తీర్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఫెడరేషన్ అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. గంగాధర్ గారు చర్చలు సఫలమయ్యేలా కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న సీఎం ప్లాన్ దిశగా ఇండస్ట్రీ ముందుకు సాగుతుంది.” అని పేర్కొన్నారు.

లేబర్ కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ..‘‘30 శాతం హైక్ కోరారు. అయితే 22.5 శాతం మొత్తంగా వేతనాల పెంపు నిర్ణయించాం. ఇది రేషియో ని బట్టి మారుతుంది. పలు డిమాండ్స్‌పై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మూడు–నాలుగు ప్రధాన కండిషన్లపై దృష్టి సారించాం. మిగతా చిన్న సమస్యల కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఒక నెలలో ఆ కమిటీ నివేదిక ఇస్తుంది. ఇకపై స్ట్రైక్ లేదు, రేపటి నుంచి షూటింగ్స్ సజావుగా సాగుతాయి.” అని స్పష్టం చేశారు.

ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని మాట్లాడుతూ..‘‘ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇష్యూను పరిష్కరించినందుకు ధన్యవాదాలు. కార్మిక శాఖ, ముఖ్యంగా లేబర్ కమిషనర్ చొరవ తీసుకుని చర్చలు జరిపారు. మేము అడిగిన డిమాండ్స్‌లో 22.5% వేతనాల పెంపు అమలు చేస్తామని అంగీకరించారు. ఇది మూడు దశల్లో ఉంటుంది.. మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం. మిగతా కండిషన్లు పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇకపై సమ్మె లేకుండా ఇండస్ట్రీ సాఫీగా సాగుతుంది.” అన్నారు.

Exit mobile version