సినీ ప్రపంచం అనేది ఒక కళాత్మకత కలిగిన ఓ గ్లామర్ ప్రపంచం. ఈ ప్రపంచంలోకి పలు విభాగాలకు సంబంధించి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే వారి వారి టాలెంట్, ప్రాముఖ్యతతో ఇక్కడ తమ స్థానాన్ని పదిలం చేసుకుంటారు. ఈ సినిమా ప్రపంచంలో ఎంత పెద్ద హీరో నటించినా, ఎంత పెద్ద డైరెక్టర్ తీసినా, ఎంత పెద్ద నిర్మాత డబ్బు పెట్టినా ఆ సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మాత్రం ఉన్న ఏకైక దారి మీడియా. అలాంటి మీడియాలోకి దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి మీడియాలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని టాలీవుడ్ లో ఎదురులేని పీఆర్వోగా ఏకచత్రాదిపతిగా చక్రం తిప్పుతున్న రారాజు బిఏ రాజు.
చదువు పూర్తిచేసుకొని ఆంద్రభూమి పత్రికలో జర్నలిస్ట్ గా ఆయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఆయనకు సినిమాలపై ఉన్న ప్రేమతో మొట్ట మొదటి సారిగా సూపర్ హిట్ అనే సినీ పత్రికని ప్రారంభించారు. అప్పటి వరకూ ప్రత్యేకంగా సినిమా కంటూ ఎలాంటి పత్రికలూ లేవు. ఈ మధ్యకాలంలో పత్రికలూ ఎప్పుడు పెడుతున్నారో ఎప్పుడు నిలిపేస్తున్నారో తెలియని తరుణంలో ముప్పై ఏళ్ళ క్రితం మొదలు పెట్టిన ఆ సూపర్ హిట్ పత్రికని నిర్విరామంగా ఇప్పటికీ విజయవంతంగా నడుపుతున్నారు అంటే ఆ ఘనత ఒక్క రాజుగారికే చెదుతుంది.
స్వతహాగా రాజు గారు ఘట్టమనేని కృష్ణగారికి వీరాభిమాని అయితే కృష్ణ గారికి అభిమానుల్లో నచ్చే మొదటి వ్యక్తి బిఏ రాజు అంటే ఆయన కృష్ణ గారికి ఎంత ప్రత్యేక అభిమానమో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. కృష్ణ గారి వారసత్వాన్నే కాకుండా రాజు గారి అభిమానాన్ని కూడా మహేష్ బాబు పంచుకున్నాడు. అందుకే మహేష్ బాబుకి ఆయన మరింత ఆప్తుడయ్యాడు, మహేష్ బాబుకి మీడియా అంటే రాజుగారు ఉన్నారు కదా అనే నమ్మకాన్ని కలిగించారు. రాజుగారి ప్రవర్తన, నడవడిక ఎంతగానో మెప్పించిది కావున రాజుగారు ఘట్టమనేని కుటుంబానికి అభిమాని మాత్రమే కాకుండా వారి ఇంట్లో ఒకరైపోయారు. అక్కినేని ఫ్యామిలీకి, దగ్గుబాటి ఫ్యామిలీకి, బడా బడా నిర్మాతలకి, మరెంతో మంది మెప్పు పొందిన మరియు వారికి కావలసిన ఆప్త మిత్రుడు బీఏ రాజు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజుగారు పీఆర్వోగా చేస్తున్నారు అంటే ప్రమోషన్స్ విషయంలో మనకు ఎలాంటి బెంగాలేదని కొంతమంది నిర్మాతలు గుండెమీద చేయి వేసుకొని హాయిగా ఉంటారంటే ఆయన పనితనం ఏంటనేది మనకు ఇట్టే తెలిసిపోతుంది.
బిఏ రాజు గారి ప్రెస్ మీట్ కి వెళ్ళినా, సక్సెస్ మీట్ కి వెళ్ళినా, ప్రెస్ షోకి వెళ్ళినా, లేదా మరే ఈవెంట్ కి వెళ్ళినా నేను పీఆర్వో అన్న ఫీలింగ్ ఆయనలో కనపడదు. నేను పీఆర్వోని కాదు మీలో ఒక్కడిని, మీతో పాటే నేనూ అంటూ తన అనుభవం అంత వయసులేని కొంత మంది మీడియా మిత్రులతో కూడా నవ్వుతూ, నవ్విస్తూ, భుజం మీద చేయి వేసి జోక్స్ చెబుతూ సరదాగా ఉంటారు. ఆయనతో ఒక్కసారి పరిచయం చేసుకుంటే చాలు మనల్ని అంత త్వరగా మరచిపోరు. అందుకే ఆయనకు – మీడియా మిత్రులకు మధ్య చిన్న పెద్ద అన్న తేడా ఉండదు. అందుకే మీడియా మిత్రులంతా రాజు గారంటే ఆయనను పీఆర్వో అనడంకంటే ఆయన మా ఆప్తుడని గర్వంగా చెప్పుకుంటారు. ఆయన సినిమాలకే కాదు వేరే సినిమా కార్యక్రమాలకు కూడా హాజరయ్యి ఆ సమాచారాన్ని తన పత్రికకి అందిస్తాడు. ఎంత బిజీగా ఉన్నా తన సూపర్ హిట్ పత్రిక పరచురణ టైంకి ఎంత ఆలస్యమైనా కూర్చొని అన్నీ చక్కబెట్టి ప్రింటింగ్ కి పంపిస్తారు.
బిఏ రాజు ఒక్క పిఆర్వోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఏ రంగంలోనైనా ‘నీలో సత్తా ఉంటే విజయం నీకు తలవంచాల్సిందే’ అన్న మాట ఈయనకు చక్కగా సరిపోతుంది. 2014 లో బిఏ రాజు రెండు సినిమాలను ఆయన సొంత నిర్మాణంలో నిర్మించనున్నాడు. అందులో ఒకటి నూతన నటీనటులతో ప్లాన్ చేస్తుంటే, మరో సినిమాని టాలీవుడ్ యంగ్ హీరోతో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు. రాజు గారి ప్రతిభ, ఆయనలోని మంచితనం, ప్రమోషన్స్ ఏదో చెయ్యాలి అన్నట్టు కాకుండా సినిమా నాది, మనది అనుకొని సినిమా విజయం కోసం ఆయన పడే తాపత్రయమే ఆయన్ని టాలీవుడ్ లో నెంబర్ 1 పీఆర్వోగా నిలబెట్టింది. అలాగే ఎవ్వరూ చేయనన్ని సినిమాలకు ఆయన పీఆర్వోగా పనిచేసిన రికార్డు కూడా ఆయనకే సొంతం..
సీనియర్ హీరోలకు ఆయనంటే మక్కువ మరియు మర్యాద… నేటితరానికి ఆయనంటే అభిమానం.. మీడియా మిత్రులకి ఆప్తుడు… సినిమా ప్రమోషన్స్ లో రారాజు ఆయనే మన బిఏ రాజు..
నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయనకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ముందు ముందు పీఆర్వోగా, నిర్మాతగా మరెన్నో విజయాలను అందుకొని తెలుగు చిత్ర సీమలో చిరస్థాయిగా నిలిచిపోఏ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాం..