అతని పేరు చెప్పగానే ఎలాంటి వారికైనా నవ్వు వచ్చేస్తుంది. ఆ పేరు తలచుకోగానే ఆయన రూపం తల్చుకొని మరీ నవ్వేస్తారు. ఆయన పేరే కాదు ఆయన పోషించిన పాత్ర పేరు చెప్పిన మనకి నవ్వు ఆగదు. ఆటో దాదా, లెక్చరర్, గుడి పూజారి ఇలా ఏ పాత్ర అయినా ఆ పాత్రలో ఇమిడిపోయి మనల్ని కడుపుబ్బా నవ్వించే నటుడు మరెవరో కాదు బ్రహ్మానందం. ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే పేరు బ్రహ్మి. ఈ రోజు (ఫిబ్రవరి 1) ఆయన పుట్టినరోజు. నేటితో ఆయన 56 వసంతాలు పూర్తి చేసుకున్నారు. బ్రహ్మానందం గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో మధ్యతరగతి కుటుంబలో జన్మించారు. ఆయన చదువంతా భీమవరంలో సాగింది.
అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేసారు. ఆ తరువాత దూరధర్శన్లో ‘పకపకలు’ అనే సీరియల్లో నటించారు. ‘ శ్రీ తాతావతారం’ ఆయన నటించిన మొదటి సినిమా కాగా జంధ్యాల గారి డైరెక్షన్లో వచ్చిన ‘అహ నా పెళ్ళంట’ చిత్రం తో బాగా ఫేమస్ అయ్యారు. తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. తరువాత తెలుగు చలచిత్ర పరిశ్రమలో టాప్ కమెడియన్ గా ఎదిగారు. బ్రహ్మి కామెడీ తో హైలెట్ అయినా సినిమాలు కూడా ఉన్నాయి. మిస్టర్ నోకియా మరియు నిప్పు సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమయ్యారు.