ఆరు నెలలుగా థియేటర్లు మూతబడి ఉండటంతో చాలా సినిమాల విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అన్ని పనులు ముగించుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన సినిమాలు కొన్నైతే, షూటింగ్ ఆఖరి దశలో ఉండి నిలిచిపోయిన సినిమాలు కొన్ని. లాక్ డౌన్ సడలింపులు మూలంగా ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుతున్నాయి. రాజమౌళి ఇప్పటికే రంగంలోకి దిగి ‘ఆర్ఆర్ఆర్’ మొదలుపెట్టగా దర్శకులు ఒక్కొక్కరు మిగిలి ఉన్న తమ సినిమాలను సెట్స్ మీదికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.
హీరోలు నాగ చైతన్య, శర్వానంద్ లాంటి వారు చిత్రీకరణలో పాల్గొంటుండగా త్వరలో రవితేజ కూడ బరిలోకి దిగనున్నారు. ఇక ఎలాగూ 15 తర్వాత థియేటర్లు రీఓపెన్ కానున్నాయి. దీంతో ఇన్నాళ్లు థియేటర్ అనుభవం మిస్సయిన ప్రేక్షకులు ఏయే సినిమాలు విడుదలవుతాయోనని ఆసక్తిగా ఉన్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు థియేటర్లు తెరుచుకోగానే దసరాకు రవితేజ, గోపీచంద్ మలినేనిల ‘క్రాక్’ దసరా కానుకగా రావొచ్చని, మెగాస్టార్ అల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ‘ఉప్పెన’ దీపావళికి’ విడుదలకావచ్చని అలాగే చైతూ, శేఖర్ కమ్ముల చేస్తున్న ‘లవ్ స్టోరీ’ క్రిష్టమస్ కానుకగా, రామ్ ‘రెడ్’ వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలవుతాయని తెలుస్తోంది. చూడాలి మరి వీటిలో ఎన్ని సినిమాలు అనుకుంటున్న తేదీకి థియేటర్లలోకి దిగుతాయో.