మలయాళ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ ఎట్టకేలకు తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ‘మహానటి’ చిత్రంలో ఆయన నటన చూసిన తెలుగు ఆడియన్స్ ఆయన సోలో హీరోగా తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. దుల్కర్ సైతం మంచి కథ దొరికితే తప్పకుండా తెలుగులో సినిమా చేస్తానని అన్నారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వైజయంతీ మూవీస్ లో దుల్కర్ సల్మాన్ త్వరలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
‘లై, పడి పడి లేచే మనసు’ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దుల్కర్ కోసం కథ రాసుకుని ఆయనకు వినిపించారట. కథ బాగుండటంతో దుల్కర్ సైతం ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నారట. ఈ కథ పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అన్నీ కుదిరితే లాక్ డౌన్ తరువాత మొదలయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే దుల్కర్ చిత్రాలు తరచూ తెలుగులోకి డబ్ అవుతుండటంతో ఆయన డైరెక్ట్ తెలుగు సినిమాకు మంచి మార్కెట్ లభించే అవకాశం ఉంది.