సమీక్ష : మై బేబి – కొంతవరకు ఓకే అనిపించే క్రైమ్ థ్రిల్లర్

My Baby

విడుదల తేదీ : జూలై 18, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అథర్వా మురళి, నిమిషా సజయన్, చేతన్, విజి చంద్రశేఖర్, ఆర్‌జె రమేష్ తిలక్, తదితరులు
దర్శకత్వం : నెల్సన్ వెంకటేశన్
నిర్మాతలు : జయంతి అంబేద్ కుమార్, అంబేద్ కుమార్, సురేష్ కొండేటి(తెలుగు డబ్బింగ్)
సంగీతం : గిబ్రన్, అంతల్ ఆకాష్, శ్రీకాంత్ హరిహరన్, ప్రవీణ్ సైవి, సత్య ప్రకాష్, సాహి శివ
సినిమాటోగ్రఫీ : పార్థిబన్
ఎడిటింగ్ : వి.జె. సాబు జోసెఫ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

తమిళ్‌లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం DNA అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి తెలుగులో ‘మై బేబి’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

మానసిక సమస్యతో బాధపడుతున్న దివ్య(నిమిషా సజయన్), ప్రేమ విఫలమై తాగుడుకు బానిసైన ఆనంద్(అథర్వా)ల వివాహాన్ని పెద్దలు నిశ్చయిస్తారు. పెళ్లి తర్వాత వారిలో మంచి మార్పు కనిపిస్తుంది. కట్ చేస్తే.. దివ్య ఓ పండంటి బాబుకు జన్మనిస్తుంది. కానీ, తన వద్ద ఉన్నది తన కొడుకు కాదని దివ్య ఆరోపిస్తుంది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతారు. దివ్య నిజమే చెబుతుందా..? దివ్య మాటలను నమ్మిన ఆనంద్ ఎలాంటి సాహసం చేస్తాడు..? ఇంతకీ దివ్య, ఆనంద్‌ల కొడుకు ఏమయ్యాడు..? దీని వెనకాల ఉన్నది ఎవరు..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఓ మంచి పాయింట్‌తో ఈ కథను రాసుకున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొన్ని ఆసుపత్రుల్లో పసిబిడ్డలు మాయం అయ్యే సీన్స్‌ను ఈ సినిమాలో బాగా ప్రజెంట్ చేశారు. చిన్నారులను ఎత్తుకెళ్లి వారితో ఏం చేస్తారు..? అనే పాయింట్స్‌ను మనకు చాలా చక్కగా వివరించారు. క్రైమ్ థ్రిల్లర్స్‌కు కావాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాలో మనల్ని ఆకట్టుకుంటుంది.

నిమిషా సజయన్, అథర్వా ఇద్దరు కూడా చాలా చక్కగా నటించారు. ముఖ్యంగా నిమిషా సజయన్ మానసిక సమస్యతో బాధపడుతున్న అమ్మాయిగా సూపర్ యాక్టింగ్ చేసింది. కథలోని సస్పెన్స్‌ను రివీల్ చేసే తీరు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకులకు సెకండాఫ్‌పై మరింత ఆసక్తి ఏర్పడేలా చేస్తుంది.

సెకండాఫ్‌లోనూ సస్పెన్స్ కొనసాగుతూ అదే ట్రాక్‌పై కథను తీసుకెళ్లిన తీరు వర్కవుట్ అయింది. అయితే, మధ్యలో కొన్ని సీన్స్ మినహాయిస్తే, ట్విస్టులు వాటిని రివీల్ చేసే బీజీఎం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి థ్రిల్లింగ్ చిత్రాలకు ఎంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉన్నా, కథను నడిపించే తీరు బాగుండాలి. ఈ విషయంలో చిత్ర యూనిట్ అక్కడక్కడా తబడినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా కథలోకి తీసుకెళ్లేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకుంటాడు. అది కొంతమేర ప్రేక్షకులను మెప్పించదు.

ఫస్ట్ హాఫ్‌లో కథ స్లో గా సాగడం కూడా మైనస్. ఇక సెకండాఫ్‌లో కూడా కొన్ని ల్యాగ్ సీన్స్ మెప్పించవు. యాక్షన్‌కు మంచి స్కోప్ ఉన్నా దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదనిపిస్తుంది. ఒక సాధారణ వ్యక్తి అయిన హీరో చేసే పనులు కూడా కొంతవరకు సినిమాటిక్‌గా అనిపిస్తాయి.

కొన్ని పాత్రలను పూర్తిగా వినియోగించుకోలేదనిపిస్తుంది. ఇక మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండాల్సిన క్లైమాక్స్‌ను లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. సాంగ్స్ కూడా ఈ సినిమాకు పెద్దగా వర్కవుట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ రాసుకున్న కథ బాగుంది. అయితే, దాని ఎగ్జిక్యూషన్‌లో ఆయన ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. థ్రిల్లింగ్ అంశాలను ఆయన చక్కగా హ్యాండిల్ చేశారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. పార్థిబన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సాబు జోసెఫ్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. పాటల వరకు సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. అయితే, గిబ్రన్ అందించిన బీజీఎం మాత్రం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘మై బేబి’ చిత్రం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను కొంతవరకు ఇంప్రెస్ చేస్తుంది. సినిమాలోని మెయిన్ ప్లాట్, నటీనటులు పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. కొన్ని ల్యాగ్ సీన్స్, కొంతమేర స్లో సేస్, పాటలు ఈ సినిమాకు మైనస్‌గా నిలిచాయి. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Exit mobile version