ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఆగస్టు 14, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : వర్ష బొల్లమ్మ, మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, రమణ భార్గవ్, కంచరపాలెం కిషోర్, జ్వాలా కోటి, రాకేండు మౌళి తదితరులు
దర్శకత్వం : ప్రశాంత్ కుమార్ దిమ్మల
నిర్మాతలు : కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్
సినిమాటోగ్రఫీ : శ్రీరామ్ ముక్కపాటి
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : మాధవ్ కుమార్ గుల్లపల్లి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఇటీవల తమ కంటెంట్‌ను కాపీ కొట్టారంటూ ఆరోపణలు చేసిన ఈటీవీ విన్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మెల డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్‌లో వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ చేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ ‘కానిస్టేబుల్ కనకం’ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
1990ల కాలంలో శ్రీకాకుళంలోని రేపల్లెలో ఈ సిరీస్ కథ సాగుతుంది. ఈ గ్రామంలో అడవి గుట్ట అనే రహస్య ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోకి వెళ్లిన మహిళలు కనిపించకుండా పోతుంటారు. దీంతో అక్కడికి ఎవరూ వెళ్ళకుండా గ్రామస్థులు కఠిన నిర్ణయం తీసుకుంటారు. రేపల్లెలో కనక మహాలక్ష్మి అలియాస్ కనకం(వర్ష బొల్లమ్మ) కానిస్టేబుల్‌గా పోస్టింగ్ తీసుకుంటుంది. ఒక రోజు కనకం స్నేహితురాలు చంద్రిక(మేఘ లేఖ) కనిపించకుండా పోతుంది. అసలు చంద్రిక ఏమైంది..? కనిపించకుండా పోయిన మహిళలు ఏమయ్యారు..? వీటి వెనకాల అసలు కథ ఏమిటి..? ఈ విషయాలను కనకం కనుక్కుంటుందా..? అనేది ఈ సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్ :
కనకం పాత్రలో వర్ష బొల్లమ్మ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె భయస్థురాలిగా చేసిన పర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ఆమె ప్రతి విషయానికి భయంతో వణికిపోతుంది. అయితే, ఆమె స్నేహితులు తనని భయం వదిలేసి ధైర్యంగా ఉండాల్సిందిగా సూచిస్తుంటారు. ఆ తర్వాత భయాన్ని వీడిన కనకం ఎలాంటి సాహసం చేసిందనేది ప్రేక్షకులను మెప్పిస్తుంది.
1990లలో ఈ సిరీస్ జరుగుతుండటంతో అప్పటి పరిస్థితులను దర్శకుడు చక్కగా చూపెట్టాడు. ఆ రోజుల్లో ఆడవారిని చులకనగా చూసే విధానం మన కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. ఈ సిరీస్ ఓ చక్కటి నోట్‌తో ప్రారంభం కావడం ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంది. పాత్రలను మలిచిన తీరు కూడా చక్కగా ఉంది.
కనకం ఆమె స్నేహితురాలు చంద్రిక పాత్రల మధ్య బాండింగ్ చక్కగా ప్రెజెంట్ చేశారు. కథకు కావాల్సిన ఎమోషన్‌ను వారిద్దరు పండించారు. విలన్ పాత్ర కూడా ఆకట్టుకునే విధంగా ఉండటం ఈ సిరీస్‌కు కలిసొచ్చింది. హత్యల వెనకాల కారణాన్ని కూడా చక్కగా చూపెట్టారు. రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, రమణ భార్గవ్, ప్రేమ్ సాగర్ తమ పాత్రలతో మెప్పిస్తారు.
మైనస్ పాయింట్స్ :
ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో థ్రిల్లర్ సిరీస్‌లకు కొదువే లేదు. అలాంటిది కొత్తదనం లేకపోతే ఏ సిరీస్‌ను కూడా ప్రేక్షకులు ఆదరించడం లేదు. కానిస్టేబుల్ కనకం కూడా ఇదే తరహాలో వైవిధ్యాన్ని వదిలి చప్పటి థ్రిల్లింగ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఇందులోని ఇన్వెస్టిగేషన్ విధానం చాలా బోరింగ్‌గా సాగడం కూడా మైనస్. థ్రిల్స్ లేకపోవడం ఈ వెబ్ సిరీస్‌కు పెద్ద లోపం అని చెప్పాలి. ఇలాంటి కథను చాలా సార్లు చూసినట్టు ప్రేక్షకులను అనిపిస్తుంది. అయితే, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే గనక ఉండి ఉంటే ఈ సిరీస్ ఫలితం వేరేలా ఉండేది.
ఈ సిరీస్‌లో వావ్ మూమెంట్స్ లేకపోవడంతో చాలా రొటీన్ టెంప్లేట్‌గా మిగిలిపోయింది. కథను స్టార్ట్ చేసిన తీరు బాగున్నా.. హీరోయిన్ ఫ్రెండ్ ఎప్పుడైతే తప్పిపోతుందో, ఇక అప్పటి నుంచి ఈ సిరీస్ ముందుకు సాగిన తీరు పెద్దగా ఇంప్రెస్ చేయదు. ఇందులో వాడిన కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంకా బెటర్‌గా ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
‘కానిస్టేబుల్ కనకం’ తెలుగు డిజిటల్ కంటెంట్‌లో టెక్నికల్‌గా ఓ చక్కటి ప్రయత్నం అని చెప్పాలి. సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు బలంగా మారింది. రైటింగ్ అంతగా ఆకట్టుకోకపోయినా, బీజీఎం బాగా వర్కవుట్ అయింది.
శ్రీరామ్ ముక్కపాటి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. విష్ణు వర్ధన్ పుల్ల ప్రొడక్షన్ డిజైన్ కూడా మెప్పిస్తుంది. ఎడిటింగ్ చాలా వరకు ఫర్వాలేదనిపిస్తుంది. దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల ఈ కథను మరికొంత బలంగా రాసుకుని ఉంటే ప్రేక్షకులను ఆయన మరింత ఎంగేజింగ్‌గా పెట్టేవాడు.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘కానిస్టేబుల్ కనకం’ ఒక క్రైమ్ థ్రిల్లర్‌గా కొన్ని మూమెంట్స్‌తో పర్వాలేదనిపిస్తుంది. వర్ష బొల్లమ్మ, విలన్ నటనతో పాటు లీడ్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకుంటాయి. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే మెప్పించకపోవడం మైనస్. థ్రిల్లర్ సిరీస్‌లను ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్‌ను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team