మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వెండి తెరకు పరిచయం కానున్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. షూటింగ్ సహా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలవడమే ఆలస్యం అనుకుంటుండగా కోవిడ్ లాక్ డౌన్ విధించబడింది. దీంతో ఆరు నెలలు రిలీజ్ ఆలస్యమైంది. దీంతో ఒకానొక దశలో నిర్మాతలు ఓటీటీ విడుదలకు వెళుతున్నారనే ప్రచారం జరిగింది.
సినిమా నుండి విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన రావడంతో ప్రేక్షకుల్లో హైప్ పెరిగింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థలు హక్కుల కోసం నిర్మాతలను సంప్రదించాయి. మంచి ధర ఇస్తామని ఆఫర్ చేశాయి. కానీ నిర్మాతలు మాత్రం ఒప్పుకోలేదు. మంచి ధర వచ్చినా నిర్మాతలు ఓటీటీ విడుదలకు ఒప్పుకోకపోవడం వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని తెలుస్తోంది.
వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న డెబ్యూ సినిమా కాబట్టి సినిమాకు ఓటీటీ ద్వారా కాకుండా ఆలస్యమైనా సరే నేరుగా థియేటర్లలోనే విడుదల చేస్తే బాగుంటుందని, అప్పుడే పరిచయం గొప్పగా ఉంటుందని చిరు ఓటీటీ విడుదలకు నో చెప్పారని తెలుస్తోంది. నిజమే మరి.. థియేటర్లో విడుదలైతే వచ్చే క్రేజ్, హైప్ ఓటీటీ ద్వారా హీరోలు పొందలేరు కదా. ఏ కొత్త హీరోకైనా మొదటి సినిమాను థియేటర్లోనే చూసుకోవాలని ఆశపడతాడు. ఎలాగూ అక్టోబర్ 15 నుండి థియేటర్లు తెరుచుకోనున్నాయి కాబట్టి విడుదలకు ఇబ్బందులు తొలగినట్టే. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.