విడుదల తేదీ : ఆగస్టు 29, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : విజయ్ రామరాజు, సిజా రోజ్, దయానంద్ రెడ్డి, అజయ్, తదితరులు
దర్శకుడు : విక్రాంత్ రుద్ర
నిర్మాత : శ్రీని గుబ్బల
సంగీతం : విఘ్నేశ్ భాస్కరన్
సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి
ఎడిటింగ్ : ప్రదీప్ నందన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా రిలీజ్‌కు ముందే పలు ఇంటర్నేషనల్ వేదికల్లో అవార్డులు అందుకున్న చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. కబడ్డీ నేపథ్యంలో విక్రాంత్ రుద్ర డైరెక్షన్‌లో విజయ్ రామరాజు లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
1980-90 ల కాలంలో జరిగిన ఓ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అనాథ అయిన అర్జున్ చక్రవర్తి(విజయ్ రామరాజు)ని మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య(దయానంద్ రెడ్డి) చేరదీసి పెంచుకుంటాడు. కబడ్డీ ఆట పై మక్కువతో అర్జున్ చక్రవర్తి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని కష్టపడతాడు. ఈ క్రమంలో దేవిక(సిజా రోజ్) అనే అమ్మాయిని అర్జున్ ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఓ కీలక మ్యాచ్ కోసం దేవికకు దూరంగా వెళ్తాడు అర్జున్. అతడు తిరిగి వచ్చాక ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి..? అతడు కబడ్డీ ని ఎందుకు దూరం పెడతాడు..? అర్జున్‌తో కబడ్డీ కోచ్ కుల్కర్ణి(అజయ్)కి ఎలాంటి సంబంధం..? ఇంతకీ రంగయ్య ఏమయ్యాడు..? చివరకు అర్జున్ కబడ్డీ తో పాటు జీవితంలో ఏమయ్యాడు..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. 1980-90ల కాలంలో కబడ్డీ ఆటకు ఎలాంటి గుర్తింపు ఉంది.. అప్పుడున్న పరిస్థితుల్లో ఆటగాళ్లు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.. అనే పాయింట్స్ చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. ఓ అనాథ నేషనల్ స్థాయి ఆటగాడిగా ఎదిగేందుకు ఎలాంటి అవమానాలు పడ్డాడు.. అతడి జీవితంలో ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి.. అనే అంశాలు చక్కగా చూపెట్టారు.
అర్జున్ చక్రవర్తి పాత్రలో చాలా వేరియేషన్స్ చూపెట్టారు. ఈ పాత్రలో విజయ్ రామరాజు పూర్తిగా ఒదిగిపోయాడని చెప్పాలి. ముఖ్యంగా కథకు అనుగుణంగా అతడి ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక నటన పరంగానూ విజయ్ రామరాజు తన బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. దయానంద్ రెడ్డికి ఈ సినిమాలో సాలిడ్ పాత్ర పడిందని చెప్పాలి. రంగయ్య పాత్రలో ఆయన చేసిన యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
తాగుడుకు బానిసైన వ్యక్తి తిరిగి తన ఆటతో పాటు జీవితాన్ని ఎలా గెలిచాడనే పాయింట్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్ కూడా కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ ఈ చిత్రంలోని డైలాగులు. చాలా డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కోచ్ పాత్రలో అజయ్ కూడా ఆకట్టుకున్నాడు. సినిమా ప్రొసీడింగ్‌కు అనుగుణంగా వచ్చే బీజీఎం బాగా ఎలివేట్ అయింది.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో ఎమోషన్ ఏ స్థాయిలో ఉన్నా, దానిని హ్యాండిల్ చేసే విధానం బాగుండాలి. అయితే, ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు ఈ విషయంలో కాస్త తడబడినట్లు కనిపిస్తుంది. ఆటపై హీరో చూపెట్టిన ఫోకస్ ఎందుకో ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.
దీనికి తోడు, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్ కూడా పెద్దగా మెప్పించదు. అందులోనూ వారి మధ్య వచ్చే రొటీన్ సీన్స్ ప్రేక్షకులను విసిగిస్తాయి. ఇక సాంగ్స్ కూడా పెద్దగా మెప్పించవు. కబడ్డీ ఆటలో ప్లేయర్స్ ఇంచుమించు ఒకే రేంజ్‌లో ఉంటారు. కానీ ఈ సినిమాలో హీరో మిగతా వారిని డామినేట్ చేసేలా ఉండటం కాస్త విడ్డూరంగా కనిపిస్తుంది.
ఇలాంటి సినిమాలో కొత్తగా చెప్పేందుకు ఏమీ ఉండదు. అలాంటప్పుడు ఉన్న నటీనటుల నుంచి 100 శాతం రాబట్టుకుని వారిని పూర్తిగా వినియోగించుకోవాలి. కానీ, ఇందులో సిజా రోజ్, అజయ్, హీరో ఫ్రెండ్ రమణ లాంటి పాత్రలను పూర్తిగా వినియోగించుకోలేక పోయారు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు విక్రాంత్ రుద్ర ఎంచుకున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కథ రొటీన్ అయినప్పటికీ, దానికి ఎమోషనల్ టచ్ ఇచ్చిన విధానం బాగుంది. అయితే, స్క్రీన్ ప్లే విషయంలో ఆయన ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. చాలా సీన్స్ సాగదీతగా సాగినట్లు అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ చిత్రానికి బలంగా నిలిచింది. 1980-90 ల కాలం నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్టు చూపెట్టారు. సంగీతం పరంగా సాంగ్స్ పెద్ద ఇంపాక్ట్ చూపకపోయినా, బీజీఎం బాగా వచ్చింది. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రం రొటీన్ స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ, ఎమోషనల్ టచ్‌తో ప్రేక్షకులను కొంతవరకు మెప్పిస్తుంది. విజయ్ రామరాజు పర్ఫార్మెన్స్, అతడి డెడికేషన్, కథలోని బలమైన ఎమోషన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. రొటీన్ బ్యాక్‌డ్రాప్, ఆకట్టుకోని లవ్ ట్రాక్, మెప్పించని సంగీతం, సాగదీత సీన్స్ ఈ చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. స్పోర్ట్స్ డ్రామా చిత్రాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని తక్కువ అంచనాలతో చూడటం బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team