ఐటెం సాంగ్లో అంజలి.!


హీరోయిన్లకి ఎన్ని సినిమాల్లో నటించినా రాని క్రేజ్ ఒక్క ఐటెం సాంగ్ చేస్తే వచ్చేస్తుంది, ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎంతో మంది టాప్ హీరోయిన్లు కూడా ఈ మధ్య ఐటెం సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం వారి లిస్టులో ‘షాపింగ్ మాల్’ ఫేమ్ అంజలి కూడా చేరనుంది. స్వతహాగా అచ్చమైన తెలుగమ్మాయి అయిన అంజలి మొదట తమిళనాడులో తన అదృష్టాన్ని పరీక్షించుకొని నటిగా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు మరియు తమిళంలో వరుసగా ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ గ్లామర్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నట్టున్నారు. అందుకే తమిళంలో ఇటీవలే విడుదలైన ‘కలకలప్పు’ సినిమాలో గ్లామర్ గా కనిపించింది, ఇప్పుడు తను చేస్తున్న ‘సెట్టై’ సినిమాలో మరో అడుగు ముందుకేసి లిప్ కిస్ కే రెడీ అయిపొయింది. ప్రస్తుతం కోలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సూర్య హీరోగాతెరకెక్కుతున్న ‘సింగం -2’ సినిమాలో అంజలి ఒక ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించారు. ముందుగా ఈ పాట కోసం నయనతార మరియు శ్రియలను సంప్రదించారు, వారికి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ అవకాశం అంజలిని వరించింది.

ప్రస్తుతం అంజలి తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో నటిస్తుండగా, రవితేజ సరసన ‘బలుపు’ అనే సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఈ రెండు సినిమాలు తెలుగులో తనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతాయని అంజలి భావిస్తున్నారు.

Exit mobile version