‘జర్నీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగమ్మాయి అంజలి ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు నాట మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాతో గుర్తింపుతో పాటు తెలుగు మంచి ఆఫర్లను అందుకుంది. చూడటానికి పక్కింటి అమ్మాయిలా, సంతోషంగా కనపడే అంజలి తన పిన్ని తనని వేదిస్తోందని ఆరోపణలు చేసింది.
‘నా సొంత పిన్ని నన్ను ఎక్కువగా వేదిస్తోంది. నన్ను వాళ్ళ అవసరాల కోసం ఒక ఎటిఎం మిషన్ లా వాడుకుంటున్నారు. మా పిన్ని, డైరెక్టర్ కలంజియంతో కలిసి నా ఆస్తి మొత్తం దోచుకున్నారు. ప్రస్తుతానికి నా కనీస ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బు లేదు. ఇవన్నీ కాకుండా నా పిన్ని కుటుంబ సభ్యుల నుంచి నా ప్రాణానికి ప్రమాదం ఉంది. పిన్ని వేదింపుల పై ఫిర్యాదు చేస్తానని’అంజలి మీడియాకి తెలిపింది. ఇంతలోపే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అంజలి నిన్న ఉదయం నుంచి కనిపించడం లేదు. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ లో ఉంది. ఆమె ఆచూకి తెలియకపోవడంతో అంజలి కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు.
కెరీర్ ఎంతో సాఫీగా సాగిపోతున్న సమయంలో తనకి అండగా నిలవాల్సిన కుటుంబ సభ్యుల నుంచే అంజలికి ఆపద పొంచి ఉండడం భాదాకరమైన విషయం. ఈ విషయం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.