సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నటిస్తున్న గ్రాఫికల్ మానియా ‘కొచ్చాడియాన్’. తెలుగులో ‘విక్రమ సింహా’గా రానుంది. ఈ చిత్ర టీం ఈ సినిమాని గతంలో ఏప్రిల్ 11న రిలీజ్ చేస్తారని తెలియజేశారు కానీ ఈ తేదీకి సినిమా రెడీ అవ్వక పోవడంతో తాజాగా ఈ సినిమాని మే 9న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు.
రజినీ కాంత్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి కెఎస్ రవికుమార్ కథ – స్క్రీన్ ప్లే అందిస్తే రజినీ కుమార్తె సౌందర్య రజినీ కాంత్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కొచ్చాడియాన్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో రిలీజ్ కానుంది.
‘కొచ్చాడియాన్’ సినిమా పాండ్యన్ కింగ్ అయిన కొచ్చాడియాన్ రణదీరన్ జీవిత కథ. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, శోభన తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు.