‘ఎదురింటి మొగుడు – పక్కింటి పెళ్ళాం’ తో తెలుగు సినిమా పరిశ్రమకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై ఆ తరువాత ‘చంటిగాడు’ సినిమాతో హీరోగా పరిచయమైన హీరో బాలాఆదిత్య. తను చివరిగా నటించిన ‘1940లో ఒక గ్రామం’ సినిమాకి జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. గత మూడు సంవత్సరాలుగా చదువు కోసం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆదిత్య ఇకనుండి సినిమాల పైనే దృష్టి పెడతానంటున్నాడు.
పాటల రచయితగా మారినట్టున్నారు అని అడిగితే ఆదిత్య మాట్లాడుతూ ‘నాకు మొదట రచయిత గానే అవకాశం వచ్చింది. ఆ పాటను పాడేటప్పుడు నా మోహంలోని భావాలను చూసి నాకు చంటిగాడు సినిమాలో అవకాశం ఇచ్చారు. అలానే ఇప్పుడూ ‘కాఫీ విత్ మై వైఫ్’ సినిమాకి రెండు పాటలను రాశానని అన్నాడు. అలాగే తన కెరీర్ ప్లాన్స్ గురించి చెబుతూ ‘ ఎఎన్ఆర్, దేవానంద్ లలా జీవితాంతం నటించాలని వుంది. హీరోగానే కాకుండా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని నా ఆశ. అంతేకాదు రాజేంద్ర ప్రసాద్ గారిలా కామెడీ సినిమాలు, అలాగే పౌరాణిక సినిమాల్లో చాలెంజింగ్ పాత్రాలు చేయలాని వుంది’ అన్నాడు. బాలా ఆదిత్య తను పెద్దవాడినని తెలియడానికి ఈ హీరో పేరులో వున్న బాల అనే దానిని తొలగించికొని ఆదిత్య గా పేరు మార్చుకోనున్నాడు.