పైరసీ భూతానికి సంబంధించి చోటు చేసుకున్న పరిణామంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశంలో అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాత సి. కళ్యాణ్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు.
అధ్యక్షుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ, “పైరసీకి పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం, సీపీ సజ్జనార్ గారికి ధన్యవాదాలు. ఫిల్మ్ ఛాంబర్‌లోని వీడియో పైరసీ సెల్ నిరంతరం కృషి చేస్తోంది” అన్నారు.
నిర్మాత సి. కళ్యాణ్ స్పందిస్తూ, “పైరసీ చేసే వాళ్లను కఠినంగా శిక్షించాలి. వందలమంది కష్టపడే సినిమాను ఒక క్లిక్‌తో దొంగిలించడం నేరం. విదేశీ సినిమాల పైరసీ అరికట్టడంలో కూడా మా సెల్ మంచి పని చేసింది. ఐబొమ్మ వంటి ప్లాట్‌ఫార్మ్‌లను చట్టపరంగా అడ్డుకునేందుకు రేవంత్ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ అభినందనీయం” అన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, “పైరసీకి మూలం తరచుగా క్యూబ్, VFS వంటి టెక్నికల్ ప్లాట్‌ఫారమ్‌లు. నిర్మాతలు వాటిపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పెద్ద బడ్జెట్ పెట్టి టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు పైరసీ వైపు మొగ్గు చూపుతున్నారు. క్వాలిటీ సినిమాలు తీయాలి కానీ అనవసరంగా భారీ బడ్జెట్లు పెంచి కొంతమందికి మాత్రమే పెద్ద రెమ్యునరేషన్ ఇవ్వడం పరిశ్రమకు నష్టం” అని అన్నారు.


