సినిమా హీరోలు ప్రేక్షకులను అలరించడం కోసం రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారికీ గాయాలు కూడా అవుతుంటాయి. ఐతే, వారు గాయాలను లెక్కచేయకుండా చిత్రీకరణలో పాల్గొంటుంటారు. కాగా ఓ సినిమా చిత్రీకరణలో తనకు జరిగిన ప్రమాదం గురించి బాబీ డియోల్ తాజాగా స్పందించారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. ‘నాకు ఇంకా ఆ గాయం గుర్తుంది. నా తొలి చిత్రం ‘బర్సాత్’ షూటింగ్ సమయంలో నాకు పెద్ద ప్రమాదం జరిగింది. అప్పట్లో నా కెరీర్ ప్రారంభం కాకముందే ముగిసిపోతుందని అందరూ అనుకున్నారు’ అని బాబీ డియోల్ తెలిపారు.
బాబీ డియోల్ ఇంకా మాట్లాడుతూ.. ‘అప్పుడు నా సోదరుడు సన్నీ డియోల్ లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు. ఆ సినిమా ఇంగ్లాండ్ షూటింగ్‌లో గుర్రపుస్వారీ చేసే క్రమంలో బలంగా కిందపడిపోయా. అప్పుడు నా కాలు విరిగింది. నా అదృష్టం కొద్ది అప్పుడు సన్నీ నాతోనే ఉన్నారు. తన భుజాలపై నన్ను మోస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు నా కాలు ఇక రాదని చెప్పినా.. రాత్రికి రాత్రే సన్నీ నన్ను లండన్‌లోని ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించారు. నా కాలు నాకు వచ్చేలా చేశారు’ అంటూ బాబీ డియోల్ ఎమోషనల్ అయ్యారు.