తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మైలురాయి లాంటి చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి చిత్రాలలో ‘మల్లీశ్వరి’ ఒకటి. నేటితో ఆ చిత్రం 60 వసంతాలు పూర్తి చేసుకుంది.తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు వచ్చిన గొప్ప చిత్రాలలో మల్లీశ్వరి కూడా ఒకటి. ఇలాంటి చిత్రం ఇక ముందు కూడా ఎవరు తీయలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మల్లీశ్వరి చిత్రానికి గొప్ప దర్శకుడు బిఎన్. రెడ్డి గారు దర్శకత్వం వహించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అగ్ర నటుడు నందమూరి తారక రామారావు గారు నాగరాజు పాత్రలో మరియు భానుమతి గారు మల్లీశ్వరి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వర రావు గారు సంగీతం అందించగా దేవులపల్లి కృష్ణ శాష్త్రి గారు సాహిత్యం అందించారు. మల్లీశ్వరి చిత్రంలో మొత్తం 15 పాటలున్నాయి.
మల్లీశ్వరి చిత్ర కథ విషయానికి వస్తే పురాతన కాలంలో రాణివాసం అనే ఆచారం ఉంటుంది. రాణివాసం చేసిన యువతి రాజు గారి కోటలో శాశ్వతంగా ఉండిపోవాలని బయట మగాళ్ళను ఎవ్వరిని కలుసుకోకూడదు అనే నిబందన ఉంటుంది. మల్లీశ్వరి (భానుమతి) అనే యువతి తల్లి తండ్రులు డబ్బు కోసం బలవంతంగా మల్లిశ్వరిని రాణివాసానికి పంపిస్తారు. భానుమతి తన బావ నాగరాజు (ఎన్టీఆర్) ప్రేమించుకుంటారు. భానుమతిని రాణివాసానికి పంపడంతో నాగరాజు భానుమతిని కలుసుకోవడానికి రాజు గారి కోటకు వెళ్లి అక్కడ పట్టుబడతాడు. నాగరాజుకి శిక్ష విధించడానికి శ్రీ కృష్ణ దేవరాయల వారి దగ్గరికి తీసుకు వెళ్తారు. అక్కడ వీరి ప్రేమకథ విన్న శ్రీ కృష్ణ దేవరాయల వారు ఏం చేశారన్నది మిగతా చిత్ర కథ.
మల్లీశ్వరి చిత్రంలో ప్రతి ఒక్కరు అధ్బుతంగా నటించారు. పాటలు క్లాసిక్స్ గా మిగిలిపోగా ఈ చిత్రం కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందొంది. ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇలాంటి చిత్రాలతో ఎంతో ఖ్యాతి గడించింది.
123తెలుగు.కామ్ తరపున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మల్లీశ్వరి చిత్ర యూనిట్ సభ్యులకు జోహార్లు.