యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరో, నిర్మాత మరియు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వరూపం’. ఈ సినిమాని అప్పుడు విదుల చేస్తాం ఇప్పుడు విడుదల చేస్తున్నాం అని వస్తున్న వార్తలకు తెర పడింది. ఈ సినిమాని ఒకే సారి తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో ఒకేసారి 2013 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈ సినిమాని ప్రేక్షకులకు 3డి లో అందించాలనే కారణం వల్ల ఈ సినిమా విడుదల పలుసార్లు వాయిదా పడి జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు కానీ డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం.
టెర్రరిజంలోని ఓ కోణాన్ని ఇతివృత్తంగా చేసుకొని తీస్తున్న ఈ సినిమాకి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో కమల్ తో పాటు శేఖర్ కపూర్, రాహుల్ బోస్, పూజా కపూర్ మరియు ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషించారు. 2004లో వచ్చిన ‘పోతురాజు’ సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన కమల్ మళ్ళీ చాలా కాలం తర్వాత ‘విశ్వరూపం’ సినిమాతో సంక్రాంతి బరిలో దిగనున్నాడు.