ఆది పై కేసుపెట్టిన ఫిషర్ మాన్

ఆది పై కేసుపెట్టిన ఫిషర్ మాన్

Published on Sep 25, 2012 1:36 AM IST


‘గుండెల్లో గోదారి’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న ఆది పినిసెట్టికి రాజమండ్రిలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఒక ఆసక్తి కరమైన సంఘటన జరిగింది. ఈ చిత్రంలో ఆది చేపలు పట్టేవాడి(ఫిషర్ మాన్) పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర కోసం షూటింగ్ కి కొన్ని రోజుల ముందు ఆది అక్కడ చేపలు పట్టే వారితో కొంత సమయాన్ని గడిపి వారు ఎలా పనిచేస్తున్నారని తెలుసుకున్నాడు. షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఒక రోజు ఆది షూటింగ్లో ఉన్నప్పుడు అతన్ని చూసిన ఒక చేపలు పట్టే మనిషి అది షూటింగ్ అని తెలియక అతన్ని ఆపి, అతను తమ ప్రాంతంలో చేపలు పడుతున్నాడని కేసు పెట్టాడు. ఆ తర్వాత అదంతా ‘గుండెల్లో గోదారి’ చిత్రీకరణ కోసమని తెలుసుకున్న ఆ చేపలు పట్టే ఆయన ఆదిలో వచ్చిన ఆ మార్పును చూసి ఆశ్చర్యపడ్డాడు.

ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్లో ఆది తెలిపారు, అలాగే మాట్లాడుతూ ‘ సినిమా చిత్రీకరణ కంటే ముందు నా పాత్ర గురించి పూర్తిగా తెలుసుకుని దానికి తగ్గట్టు తయారయ్యే పద్దతిని నేను బాగా ఫాలో అవుతానని’ ఆయన అన్నారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది. లక్ష్మీ మంచు, తాప్సీ మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం 1986లో జరిగిన గోదావరి వరదల నేపధ్యంలో తెరకెక్కుతోంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ మంచు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు