తన సుత్తి తో ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులను రెండు దశాబ్దాల పాటు కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు సుత్తి వేలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుత్తి వేలు రాత్రి కన్ను మూశారు. సుత్తి వేలు గారు 1947 ఆగష్టు 7న జన్మించారు మరియు ఆయన అసలు పేరు కురుమద్దలి లక్ష్మీ నరసింహ రావు. చిన్న నాటినుంచి నాటకాల మీద ఉన్న ఆసక్తితో తన 7వ ఏటనే స్టేజ్ షో ఇచ్చారు. ఆ తర్వాత సుత్తివేలు గారు 1981లో హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన ‘ముద్ద మందారం’ చిత్రం తర్వాత తెలుగు తెరకు పరిచయమయ్యారు. 1982లో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన ‘నాలుగుస్తంభాలాట’ చిత్రంలో ఆయన పోషించిన సుత్తి పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. సుత్తి వేలు మరియు సుత్తి వీరభద్రరావు కాంబినేషన్లో వచ్చిన కామెడీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే వీరిద్దరినీ ‘టాలీవుడ్ సుత్తి జంట’ అని అంటారు. సుత్తి వేలు గారు సుమారు 200 పైగా చిత్రాల్లో నటించారు. లక్ష్మీ రాజ్యం అనే ఆమెను పెళ్ళాడిన సుత్తి వేలు గారికి ముగ్గురు అమ్మాయిలు మరియు ఒక అబ్బాయి ఉన్నారు. తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను తెగనవ్వించిన సుత్తి వేలు గారు ఇకలేరు అని చెప్పడం ఎంతో బాధాకరమైన విషయం.
సుత్తి వేలు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అతని కుటుంభ సభ్యులకు 123తెలుగు.కామ్ సంతాపాన్ని తెలియజేస్తోంది.