సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా

Kanya-Kumari Movie

విడుదల తేదీ : ఆగస్టు 27, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ, భద్రం, మురళీధర్ గౌడ్ తదితరులు
దర్శకుడు : సృజన్ అట్టాడ
నిర్మాత : సృజన్ అట్టాడ
సంగీతం : రవి నిడమర్తి
సినిమాటోగ్రఫీ : శివ గాజుల, హరిచరణ్ కె
ఎడిటింగ్ : నరేష్ అడుప

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

టాలీవుడ్ హీరోయిన్ మధుశాలిని సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘కన్యా కుమారి’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

కన్యా కుమారి(గీత్ సైనీ) జీవితంలో బాగా ఎదగాలని కోరుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలని ఆమె కల కన్నా, ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఓ షాపులో సేల్స్‌గర్ల్‌గా మిగిలిపోతుంది. మరోవైపు, తిరుపతి(శ్రీచరణ్ రాచకొండ) చిన్నతనం నుంచే వ్యవసాయం పట్ల ఆకర్షితుడవుతాడు. కన్యా కుమారిని తిరుపతి ప్రేమిస్తాడు. అయితే, తన జీవిత లక్ష్యం వేరే ఉందని ఆమె అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. అయినా కూడా తిరుపతి ఆమె వెంట పడుతుంటాడు. మరి చివరకు వీరి ప్రేమకథ ఎటువైపు వెళ్ళింది..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా కథ మొత్తం హీరోయిన్ చుట్టే తిరుగుతుంది. కన్యా కుమారి పాత్రను డిజైన్ చేసిన తీరు ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి. గీత్ సైనీ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. మధుశాలిని చెప్పినట్లుగానే గీత్ సైనీ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. శ్రీకాకుళం యాసలో తన బాడీ లాంగ్వేజ్‌ని మలిచిన తీరు ఆకట్టుకుంటుంది.

శ్రీచరణ్ రాచకొండ కొత్త హీరో అయినా, చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. వ్యవసాయం పట్ల అతను చూపే ప్యాషన్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌తో అతడి కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయింది.

కొన్ని ఫన్ మూమెంట్స్ ప్రేక్షకుల్లో నవ్వులు తెప్పిస్తాయి. ప్రతి ఒక్కరికి తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు ఉందనే కోణాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాలని ప్రయత్నించారు. మహిళల స్వేచ్ఛ, వారు ఎదుర్కొనే సమస్యలను కూడా చక్కగా ప్రజెంట్ చేశారు. భద్రం తో పాటు ఇతర నటీనటులు తమ పాత్రల మేర మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :

లీడ్ పెయిర్ మధ్య కాన్‌ఫ్లిక్ట్ బాగున్నప్పటికీ, వారి మధ్య మరికొంత ఎమోషనల్ డ్రామాను ఎలివేట్ చేసి ఉండాల్సింది. కథలో ఈ అంశాన్ని చాలా ఆలస్యంగా చూపెట్టినట్లు అనిపిస్తుంది. కథలో హీరో తనకు నచ్చిన పని చేయాలని చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం కొంతవరకు మెప్పించదు. ఈ అంశాన్ని బేస్ చేసుకుని క్లైమాక్స్‌ను అసంపూర్తిగా తెరకెక్కించారని అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్‌ను ఇంకా బెటర్‌గా తీర్చిదిద్దాల్సింది. కథను ముందుకు తీసుకెళ్లడంలో చిత్ర యూనిట్ చాలా సాగదీత ధోరణి పాటించినట్లు అనిపిస్తుంది. కొన్ని అంశాలను సైతం సరిగ్గా ప్రెజెంట్ చేయలేదని అనిపిస్తుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్ చేసేందుకు హీరో పడే పాట్లు మెప్పించవు.

కొన్ని సీన్స్‌ను కూడా సరిగా రాసుకోలేదని.. ఇది కథపై ప్రభావం చూపెట్టిందని సినిమా గడుస్తున్న కొద్ది అనిపిస్తుంది. ఈ అంశాలపై, ముఖ్యంగా ఫస్ట్‌హాఫ్‌పై మరింత ఫోకస్ పెట్టి ఉంటే కథకు బలం చేకూరేది. ఈ చిత్ర రన్‌టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ సాగదీతగా సాగిందనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా బెటర్‌గా చేసి ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

సృజన్ అట్టాడ ఈ సినిమా కోసం రాసుకున్న కథ బాగుంది. కానీ, డైరెక్షన్ పరంగా ఆయన చాలా చోట్ల తడబడ్డారు. కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ సాగదీతగా సాగడం, కొన్ని సీన్స్ మెప్పించకపోవడం, క్లైమాక్స్ ఆకట్టుకోకపోవడం వంటివి ఈ సినిమాకు డ్యామేజ్ చేశాయి. సంగీత దర్శకుడు రవి నిడమర్తి చక్కటి ప్రతిభ కనబరిచారు. ఒకట్రెండు పాటలు చక్కగా ఉన్నాయి. శివ గాజుల, హరిచరణ్ విజువల్స్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ చాలా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే, ‘కన్యా కుమారి’ సినిమాలో మంచి స్టోరీలైన్ ఉన్నప్పటికీ అది ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయింది. గీత్ సైనీ తన నటనతో ఇంప్రెస్ చేసింది. శ్రీచరణ్ రాచకొండ కూడా బాగానే చేశాడు. కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ, ఈ సినిమాలోని సాగదీత ప్రేక్షకులను విసిగిస్తుంది. ఆకట్టుకోని సీన్స్, క్లైమాక్స్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడం వంటి అంశాలు ఈ చిత్రానికి మైనస్. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version