తమిళ చిత్ర పరిశ్రమలో ఓ వివాదం నడుస్తుంది. హీరో సూర్య నిర్మాతగా భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఫోన్మగళ్ వందాల్ చిత్రాన్ని నేరుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ బంధ్ ఉన్న నేపథ్యంలో సూర్య ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐతే ఇలాంటి నిర్ణయాలు థియేటర్స్ మనుగడకే ముప్పు తెచ్చేలా ఉన్నాయన్న భయంతో తమిళనాడు, కేరళ థియేటర్స్ అసోసియేషన్స్ వ్యతిరేకించాయి. సూర్య సినిమాలను నిషేధిస్తామని హెచ్చరించాయి.
అయినా సూర్య వారి హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. కాగా మరో వైపు విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్, ధనుష్ జగమే తందిరం మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు కూడా నేరుగా ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులోకి రానున్నాయి అనే వార్తలు వస్తుండగా వారి దానిని ఖండించారు. తమ చిత్రాలు థియేటర్స్ విడుదలకే మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు. దీనితో సూర్య నిర్ణయాన్ని వారు వ్యతిరేకించినట్లు అయ్యింది.