కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం టాలీవుడ్ పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినీ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31వరకు ఎలాంటి షూటింగ్స్ జరగరాదని స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం సబబే కాబట్టి అన్ని సినిమాల నిర్మాతలు షూటింగ్స్ ఆపేశారు. దీంతో పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ విభాగాలకు చెందిన వేల మంది కార్మికులకు పనిలేకుండా పోయింది. బంద్ రెండు మూడు రోజులైతే ఎలాగోలా సర్దుకోగలరు కానీ ఏకంగా 15 రోజులు పని లేకపోవడం పెద్ద కష్టంగా మారింది.
సరే.. 15 రోజుల తర్వాతైనా పరిస్థితి చక్కబడి షూటింగ్స్ మొదలవుతాయా అంటే అదీ ఖచ్చితంగా చెప్పలేని పరిస్ఠితి. ఇక థియేటర్లు కూడా మూతబడటంతో ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వేలమంది కింది స్థాయి థియేటర్ సిబ్బంది పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. మొత్తానికి బంద్ ఒకవైపు తమ సంక్షేమం కోసమే అయినా మరోవైపు రోజువారీ జీతాల పద్దతిలో పనిచేసుకునే తమకు 15 రోజులపాటు జీతభత్యాలు ఉండకపోవడం, సంపాదనకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం తీవ్ర ఇబ్బందిగా మారిందని కార్మికులు వాపోతున్నారు.
ఇక సినిమాల నిర్మాణం కోసం బయటి వ్యక్తుల నుండి ఫైనాన్స్ తెచ్చుకున్న నిర్మాతలైతే షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల కూడా వాయిదాపడుతుందని, ఫలితంగా ఎక్కువరోజులకు వడ్డీ కట్టాల్సి వస్తుందని అంటున్నారు.