ఆగష్టులో జరగనున్న ‘ఎవడు’ తదుపరి షెడ్యూల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ ఎవడు’ చిత్రం తదుపరి షెడ్యూల్ ఆగష్టు మొదటి వారం నుండి ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ‘రచ్చ’, హిందీ రిమేక్ ‘జంజీర్’ మరియు వి.వి వినాయక్ చిత్రాల చిత్రీకరణలో బిజీగా ఉండడడం వల్ల చాలా కాలం క్రితమే ప్రారంభమైన ఈ సినిమా నిధానంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది మరియు ఈ చిత్రానికి సంభందించిన కొన్ని కీలక సన్నివేశాలను ఈ మధ్యనే హైదరాబాద్లో చిత్రీకరించారు. ప్రస్తుతం రామ్ చరణ్ కోల్ కతాలో వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు, అది పూర్తి కాగానే ‘ఎవడు’ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు.

‘ఎవడు’ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత మరియు అమీ జాక్సన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి సారిగా అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Exit mobile version