వై.వి.ఎస్ చౌదరి కొత్త సినిమా ‘రేయ్’ ముగింపు దశలో ఉంది. ఒక్క పాట, కాస్త ప్యాచ్ వర్క్ మినహా మిగిలిన చిత్రం షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది. చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. సయామీ ఖేర్ మరియు శ్రద్ధాదాస్ హీరోయిన్స్. ఈ సినిమాను వై.వి.ఎస్ చౌదరి బొమ్మరిల్లు వారి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో సాయిధరం తేజ్ కి సయామీ ఖేర్ కి మధ్య ఒక పాటను చిత్రీకరించారు. సమాచారం ప్రకారం ఈ పాటకు అక్షరాలా ఒక కోటి ఖర్చు అయిందట.
ఈ పాట గురించి చౌదరి గారు మాట్లాడుతూ “సినిమాలో అతి ముఖ్యమైన ప్రదేశంలో ఈ పాట వస్తుంది. సాయిధరంతేజ్, సయామీ ఖేర్ మధ్య తీసిన ఈ పాటలో 50 మంది డాన్సర్లు, 200 మంది జూనియర్ ఆర్టిస్ట్లు కలిపి మొత్తం 10 రోజులపాటు కష్టపడ్డారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా బృంద మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి ఈ పాటకు అద్బుతమైన సెట్ వేసారని” చెప్పారు. ఎడిటింగ్ పూర్తైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయ్. ఈ సినిమా మే నెలలో విడుదల కావచ్చు.