ఇంటర్వ్యూ: యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ – ఫ్యాషన్ ఉంటే తప్ప ప్రొడక్షన్ లోకి రావొద్దు

ఇంటర్వ్యూ: యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ – ఫ్యాషన్ ఉంటే తప్ప ప్రొడక్షన్ లోకి రావొద్దు

Published on Jul 7, 2025 8:00 AM IST

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో “బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సక్సెస్ ఫుల్ యంగ్ నిర్మాత ఎస్ కేఎన్. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ”, హిందీ “బేబి”తో పాటు ఇద్దరు కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. రేపు (జూలై 7న) పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్ కేఎన్ నిర్మాతగా తన కెరీర్ విశేషాలను, ప్రస్తుతం చేస్తున్న మూవీస్ ప్రోగ్రెస్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటో చూద్దాం.

మెగా అభిమాని నుంచి సక్సెస్ ఫుల్ నిర్మాతగా మీ జర్నీ కోసం చెప్పండి

నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. చిన్నప్పటి నుంచి వ్యాసరచన పోటీలు, డిబేట్స్ లో రాష్ట్రస్థాయిలో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించాను. అలా సినిమా స్క్రిప్ట్స్ రాయాలనే ఆలోచనలు కూడా ఉండేవి. తర్వాత పీఆర్ఓగా కెరీర్ స్టార్ట్ చేశా. కొన్నాళ్లకు మారుతి..ఇలా పీఆర్ఓ గా ఉండిపోతావా అని అంటూ నేను డైరెక్షన్ చేస్తా, మీరు ప్రొడ్యూస్ చేయండని ప్రోత్సహించాడు. మారుతి డైరెక్షన్ లో నేను, శ్రేయాస్ శ్రీను కలిసి ఈ రోజుల్లో మూవీ నిర్మించాం. ఆ సినిమా సక్సెస్ తో ప్రొడ్యూసర్ గా నా జర్నీ మొదలైంది.

బేబి హిందీ వెర్షన్ కోసం చెప్పండి

హిందీ బేబి పనులు జరుగుతున్నాయి. మనం ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకోం కానీ హిందీలో ప్రీ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తారు. నెక్ట్స్ మంత్ నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. తెలుగులో కంటే ఇంటెన్సివ్ గా హిందీ బేబి ఉంటుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ సహా ఈ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

అల్లు అరవింద్ గారితో జర్నీ కోసం

జర్నలిస్ట్, పీఆర్ఓ, ప్రొడ్యూసర్..ఇలా నా కెరీర్ లోని ప్రతి దశను ఎంజాయ్ చేశాను. జర్నలిస్ట్ గా ఒక ఆర్టికల్ రాసినప్పుడు, పీఆర్ఓగా డిఫరెంట్ గా పబ్లిసిటీ కల్పించినప్పుడు, ప్రొడ్యూసర్ గా తక్కువ బడ్జెట్ లో మంచి కథలతో మూవీస్ చేసినప్పుడు..ఏ పనైనా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యే చేశాను. ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్న అల్లు అరవింద్ గారు నాపై నమ్మకం పెట్టుకోవడం అనేది నా అదృష్టం. నేను యూవీ క్రియేషన్స్ తో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో, గీతా ఆర్ట్స్ తో, మైత్రీ వాళ్లతో కలిసి సినిమాలు చేస్తున్నానంటే అందుకు అరవింద్ గారు ఇచ్చిన స్వేచ్ఛ, ప్రోత్సహమే కారణం. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.

బన్నీ వాస్ తో జర్నీ కోసం

నా స్నేహితుడు బన్నీవాస్ కు కథపై మంచి జడ్జిమెంట్ ఉంటుంది. మ్యూజిక్, ఎడిటింగ్ మీద గ్రిప్ ఉంటుంది. ఏ సన్నివేశాలు బాగా వర్కవుట్ అవుతాయో ఆయన బాగా గెస్ చేయగలరు. ఇవన్నీ నేను బన్నీవాస్ నుంచి నేర్చుకుంటుంటా. అలాగే ఎలాంటి కష్టం వచ్చినా స్థిరంగా నిలబడటం బన్నీవాస్ ప్రత్యేకత. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా 80 పర్సెంట్ కంప్లీట్ అయ్యాక ఆ సినిమాలో కీలక పాత్ర చేసిన శ్రీహరి గారు స్వర్గస్తులయ్యారు. ఆ విషయం చెప్పేందుకు నేను బన్నీవాస్ దగ్గరకు వెళ్తే ..మనం ఏ చేయలేం కదా షటీల్ ఆడుకుందాం రా అని పిలిచాడు. కష్టం వచ్చినా అంత కూల్ గా వ్యవహరిస్తాడు.

మీ నుంచి తెలుగు మరింతమంది తెలుగు హీరోయిన్స్ ని ఆశించవచ్చా?

తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నాం. ఇప్పటిదాకా ఏడెనిమిది మందిని పరిచయం చేశాం. మరో ఇద్దరు ముగ్గురిని త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. హీరోయిన్స్ గానే కాదు వివిధ విభాగాల్లోనూ అవకాశాలు ఇస్తున్నాం. లేడీ డైరెక్టర్స్ ను కూడా పరిచయం చేస్తాం.

ఇండస్ట్రీకి మీరిచ్చే సలహా?

ఇండస్ట్రీకి సలహాలు ఇచ్చేంత పెద్దవాడిని కాదు, కానీ ఒక జర్నలిస్ట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అనిపించినవి చెప్తా. రియాల్టీ అనే సైకిల్ లో ఇండస్ట్రీ ఇప్పుడు ఉంది. ప్యాషన్ ఉంటే తప్ప ప్రొడక్షన్ లోకి రావొద్దు. ఇక్కడ పది రూపాయిలు పెడితే ఇరవై వస్తుందని అనుకోవద్దు. పోతే మొత్తం పోతుంది. వస్తే లాభం వస్తుంది. మన కష్టం అంతా ఒక్కరోజులో ఊడ్చిపెట్టుకుపోవచ్చు. నిర్మాతగా ఉండటం అనేది ముళ్లున్న సింహాసనం లాంటిది. ఇక్కడి గ్లామర్ కు ఆకర్షితులై ప్రొడక్షన్ లోకి వస్తే నష్టపోతారు.

ప్రభాస్ గారితో ది రాజా సాబ్ కోసం చెప్పండి

రాజా సాబ్ టీజర్ కు పాన్ ఇండియా వైజ్ గా ఎలాంటి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందో మీరంతా చూశారు. ప్రభాస్ గారికి గ్లోబల్ గా ఉన్న ఇమేజ్ కు తగ్గట్టుగానే రెస్పాన్స్ ఉంది. ప్రభాస్ ను ఎలా చూడాలని పదేళ్లుగా ప్రేక్షకులు, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో అలా రాజా సాబ్ లో చూడబోతున్నారు. రాజా సాబ్ మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే అవి టీజర్ తో పోయాయి. ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ చేస్తున్నాం. డిసెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాజా సాబ్ వస్తుంది.

మీకు సినిమా కాకుండా వేరే రంగాలపై ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా?

నాకు సినిమానే లోకం, మరో వ్యాపకం లేదు. ప్రతి ఫ్రైడే మూవీ చూస్తుంటాం. సినిమాల గురించే డిస్కషన్స్ చేస్తుంటా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా సినిమాల గురించే స్పందిస్తుంటా. థియేటర్స్ లో నేను సినిమాలు చూడలేక దూరంగా ఉన్నది ఒక్క కరోనా టైమ్ లోనే.

ఓటిటిల ఎఫెక్ట్ కోసం?

ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక థియరీ ఉంటుంది. మనం ఎవరికీ చెప్పనక్కర్లేదు. కరోనా టైమ్ లో ఓటీటీలు చూడటం వల్ల మన ప్రేక్షకులు స్ట్రాంగ్ కంటెంట్ కు అలవాటు పడ్డారు. మామూలుగా సినిమా ఉంటే ఎవరికీ నచ్చడం లేదు. భారీ రెమ్యునరేషన్స్, లావిష్ ప్రొడక్షన్ చేసి కంటెంట్ లేకుంటే పెట్టుబడి మొత్తం పోతుంది. నాన్ థియేట్రికల్ బాగా పే చేస్తుందని బడ్జెట్స్ పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి హీరోలకు నచ్చజెప్పుకోవాలి. మనం జ్వరం వస్తే పత్యం చేస్తాం. అన్నీ తినేస్తా అంటే మొత్తం పాడవుతుంది. ఇండస్ట్రీ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంది. శాటిలైట్, హిందీ రైట్స్, ఓటీటీ..ఇలా ఒక్కో టైమ్ లో ఒక్కోటి ప్రొడ్యూసర్స్ కు బాగా పే చేస్తూ వచ్చింది. ఈ అన్ని దశల్లోనూ థియేటర్స్ లో బాగా ఆడిన చిత్రాలే లాభాలు తీసుకొచ్చాయి. ప్రొడ్యూసర్స్ కూడా థియేటర్స్ లో ఆడిన సినిమాలే మనకు మంచివి అని గట్టిగా నమ్మితే ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు బాగుంటాయి. హీరో, డైరెక్టర్ క్రేజీ కాంబోలో ఓటీటీ కోసం ఒక మూవీ చేసి అక్కడే మనకు 80 పర్సెంట్ వస్తుందనే ప్రాజెక్ట్స్ కొన్ని ఇటీవల వచ్చాయి. ఆ బబుల్ కూడా ఇప్పుడు బరస్ట్ అయ్యింది. మళ్లీ మన పాత రూట్స్ లోకి వచ్చి థియేట్రికల్ గా ఎంజాయ్ చేసే సినిమాలు చేయాల్సిఉంది.

హిందీ, మలయాళంలో ఓటీటీలకు 8 వీక్స్ టైమ్ పెట్టుకున్నారు. అందుకే మలయాళంలో చిన్న చిత్రాలు కూడా 200 కోట్ల రూపాయల దాకా వసూళ్లు చేస్తున్నాయి. హిందీలో సినిమా బాగుంటే ఆకాశమే హద్దుగా కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగులో త్వరగా ఓటీటీలకు ఇవ్వడం వల్ల థియేటర్స్ కు వచ్చేందుకు ఆడియెన్స్ ఆలోచిస్తున్నారు. ఓటీటీలో వస్తుందిలే అనుకుంటున్నారు. థియేట్రికల్ గా ఉన్న టైమ్ కొంతే కాబట్టి ఉన్నంతలో ఆదాయం పొందాలని టికెట్ రేట్స్ పెంచుతున్నాం. టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉండటం కూడా ఆడియెన్స్ రాకపోవడానికి కారణం. తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేసే ఒకట్రెండు సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకుంటే ఓకే గానీ ప్రతి సినిమాకు అలా అవకాశం ఉందని రేట్స్ పెంచడం కరెక్ట్ కాదు. అందుబాటు ధరల్లో టికెట్స్ ఉంటే మళ్లీ థియేటర్స్ కు ఆడియెన్స్ ను ఆకర్షించవచ్చు. మనం సోషల్ మీడియాలో చూస్తే ప్రేక్షుకులు టికెట్ రేట్స్, కంటెంట్ గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. హీరో ఇమేజ్, కంటెంట్ ఈ రెండింటినీ బేస్ చేసుకుని మూవీ బడ్జెట్ పెంచుకోవచ్చు.

ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?

నేను ప్రొడ్యూసర్ కావాలని ఇండస్ట్రీకి రాలేదు. అయ్యాను. బాలీవుడ్ లో కూడా మూవీ చేస్తున్నా. నా నెక్ట్స్ ఏంటి అనేది కాలం, నేను చేసే కష్టం, అది ఇచ్చే ఫలితం చెబుతాయి. ఫ్యూచర్ లో హీరోగా, డైరెక్టర్ గా మారే ఆలోచన లేదు. అల్లు అర్జున్ నుంచి నాకు మోరల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నేను ఏదైనా ముందడుగు వేస్తుంటే, రిస్క్ చేస్తుంటే పడిపోతాననే భయం లేకుండా బన్నీ ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది. ఏడాదిన్నరలో రెండు చిత్రాలు చేయాలనేది అల్లు అర్జున్ టార్గెట్ గా పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు