రామసత్యనారాయణ సంకల్పం: ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టిన తుమ్మలపల్లి!

రామసత్యనారాయణ సంకల్పం: ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టిన తుమ్మలపల్లి!

Published on Aug 6, 2025 7:52 AM IST

Ramasatyanarayana

భీమవరం టాకీస్ అధినేత, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకే రోజు 15 సినిమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయత్నానికి సినీ ప్రముఖుల నుంచి విశేష మద్దతు లభిస్తోంది.

ఈ నెల 15న హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో 15 సినిమాలు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సీనియర్ హీరో సుమన్, ప్రముఖ రచయిత జె.కె.భారవి, కె.ఎల్. ఫిల్మ్ స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్ పాల్గొన్నారు.

సుమన్ ఈ 15 చిత్రాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించగా, జె.కె.భారవి యండమూరి సినిమా మినహా మిగతా 14 సినిమాలకు స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తానని తెలిపారు. రేలంగి నరసింహారావు, కొంతం లక్ష్మణ్ రామసత్యనారాయణ ప్రయత్నాన్ని ప్రశంసించారు.

రామసత్యనారాయణ మాట్లాడుతూ, గతంలో 12 నెలల్లో 13 సినిమాలు తీసిన అనుభవం ఉందని, ఇప్పుడు 15 సినిమాలు ఏడాదిలోపు పూర్తి చేయడం కష్టం కాదని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాల్లో యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, ఓం సాయి ప్రకాష్ వంటి ప్రముఖులు భాగస్వాములవుతుండటం గర్వంగా ఉందని తెలిపారు. కనీసం రెండుమూడు సినిమాలు విజయం సాధించినా పెట్టుబడి తిరిగి వస్తుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో 12 మంది దర్శకులు హాజరై, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ప్రతిన పూనారు.

తాజా వార్తలు