మంచు విష్ణు హీరోగా నటించిన ‘దేనికైనా రెడీ’ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, బ్రాహ్మణుల గురించి ఎదో తప్పుగా చూపించారని వివాదంలో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా బ్రాహ్మణ సంఘాలు ఆ సన్నివేశాలను తొలగించాలని ధర్నా కూడా చేసారు. ఈ సినిమాలో అలాంటివి ఏమీ లేవని మంచు విష్ణు మరోసారి వివరణ ఇచ్చారు. ‘ ‘దేనికైనా రెడీ’ సినిమాలో బ్రాహ్మణులను లేదా ఇంకెవరినీ కించపరిచే సన్నివేశాలు లేవు. ఈ సినిమా చూసిన వారికి అది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదంతా ఒకరు క్రియేట్ చేసిన పనే, వారు ఎవరనేది కనిపెట్టే పనిలోనే ఉన్నాము, వారెవరనేది కనిపెడతాం. మలయాళంలో ఈ సినిమాకి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు కానీ ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం ఎందుకిలా? నిజా నిజాలేంటో మీరే నిర్ణయించాలి. చివరిగా ‘దేనికైనా రెడీ’ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’ అని విష్ణు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ బాగున్న ఈ సినిమా విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘ఎందేనం రెడీ’ అనే టైటిల్ తో మలయాళంలో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందుతున్న ఈ సినిమాని ఈ వారాంతంలో తమిళంలో కూడా విడుదల చేయనున్నారు.