తమిళ హీరోలు విశాల్, ఆర్యలు కలిసి నటించిన చిత్రం ‘అవన్ ఇవన్’. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో ‘వాడు వీడు’ పెయుతో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. సినిమాలో విశాల్, ఆర్య కలిసి నటించిన తీరు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. వారి పోటాపోటీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పటి నుండి ఇంకో సినిమా వస్తే బాగుందని చాలాసార్లు చర్చలు నడిచాయి. ఎట్టకేలకు సుమారు 9 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుంది.
డైరెక్టర్ ఆనంద శంకర్ వీరిద్దరితో ఒక మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించనున్నారు. నిర్మాత వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉండబోతుంది వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ ప్రకటనతో తమిళ సినీ ప్రేక్షకుల్లో ప్రాజెక్ట్ పట్ల అమితాసక్తి నెలకొంది. ఆనంద్ శంకర్ గతంలో ‘అరిమ నంబి, ఇరుముగన్, నోటా’ లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు.