కాక మీదున్న స్టార్ హీరో అభిమానులు

తమిళనాడులో సినీ, రాజకీయ వాతావరణం వేడి వేడిగా ఉంది. ఉదయమే సూపర్ స్టార్ రజనీకాంత్ తన పార్టీని అధికారికంగా ప్రకటించగా అదే సమయానికి మరొక స్టార్ హీరో విజయ్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరపడం హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో అలజడి పెరిగింది. గత నెలలో ఇలాగే రెమ్యునరేషన్ విషయమై విజయ్ ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అఫీషియల్స్ షూటింగ్ ఆపి మరీ ఆయన్ను ప్రశ్నించారు. ఆ సంఘటనతో విజయ్ ఫ్యాన్స్ బాగా నొచ్చుకున్నారు.

మళ్లీ తాజాగా విజయ్ విదేశాల్లో ఉండగా ఆయన ఇంటికి ఐటీ అధికారులు వెళ్లడం, సోదాలను కొనసాగిస్తున్నారనే వార్తలు రావడంతో అభిమానుల్లో కాక మరింత పెరిగింది. కావాలనే తమ హీరోను టార్గెట్ చేశారని, ఇది రాజకీయ కుట్రని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న జరగనున్న ‘మాస్టర్’ ఆడియో వేడుకలో విజయ్ ఈ సోదాలపై స్పందించి, గట్టి సమాధానం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. దానికంటే ముందు విహారయాత్రలో ఉన్న విజయ్ తిరిగొచ్చాక ఏం మాట్లాడతారనే విషయమై సర్వత్రా అసక్తి నెలకొని ఉంది.

Exit mobile version