కన్నడలో ఘనవిజయం సాధించిన ‘వీర చంద్రహాస’ చిత్రం ఇప్పుడు తెలుగులోకి రానుంది. కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్, ఎస్జే కే బ్యానర్స్‌పై ఎమ్.వి. రాధాకృష్ణ, జేమ్స్ డబ్యూ కొమ్ము ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం, సంగీతం రెండింటినీ అందించిన రవి బస్రూర్ మాట్లాడుతూ : “ఈ సినిమా నా 12 ఏళ్ల కల. యక్షగానం కల్చర్‌ను ప్రతిబింబిస్తూ, మన మూలాలను కాపాడుకునేలా ఈ కథను తీశాం. జీరో నుంచి హీరోగా ఎలా మారతారో చూపించేలా ప్రతి ఒక్కరినీ కదిలించే కథ ఇది. ఉగ్రం వరకు నా జీవితంలో ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయి. నాకు అవకాశమిచ్చిన ప్రశాంత్ నీల్ గారు దేవుడిలాంటి వారు” అన్నారు.
నిర్మాత ఎమ్.వి. రాధాకృష్ణ మాట్లాడుతూ: “కన్నడలో 100 రోజులు విజయవంతంగా నడిచిన ‘వీర చంద్రహాస’ చిత్రాన్ని తెలుగులోకి తెస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది భారతీయ సంస్కృతిని, యక్షగానం సంప్రదాయాన్ని అందించే సినిమా. తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది” అన్నారు.
సహనిర్మాత జేమ్స్ డబ్యూ కొమ్ము మాట్లాడుతూ: “లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌తో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ లాంటి వారు. ఈ చిత్ర అనుభవం నాకు మధురమైనది. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం” అన్నారు.