రామ్ గోపాల్ వర్మ తాజా ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు అన్ని చిత్ర పరిశ్రమలను భయపెట్టేవిగా ఉన్నాయి. ఆయన సినిమా థియేటర్స్ పునఃప్రారంభం, భవిష్యత్ లో వసూళ్ల లెక్కలపై చెప్పిన అంచనాలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. ఆయన అంచనా ప్రకారం మరో ఏడాది వరకు థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేదన్నారు. థియేటర్స్ తెరుచుకున్నప్పటికీ ఒకప్పటిలా వసూళ్లు జోరు ఉండదు అన్నారు. గతకాలపు థియేటర్స్ వసూళ్లతో పోల్చుకుంటే భవిష్యత్ లో కేవలం 30 నుండి 40 శాతం వసూళ్లు మాత్రమే రావచ్చని చెప్పారు.
అంటే థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసేవారి సంఖ్య సగానికి పైగా పడిపోతుందని ఆయన అంచనా. మరి ఇదే కనుక జరిగితే ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల వసూళ్ల సంగతేంటి అనేది భయపెడుతున్న అంశం. నిజంగా ఆయన అంచనా ప్రకారం థియేటర్స్ వసూళ్లు ఆ స్థాయిలో పడిపోతే…భారీ బడ్జెట్ చిత్రాలకు లాభాల సంగతి అటుంచితే, పెట్టుబడి రావడం కూడా కష్టమే. ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా లాభాలు పంచాలి అంటే కనీసం 600కోట్లకు పైగా వసూళ్లు సాధించాలి. థియేటర్స్ కి వచ్చే వారి సంఖ్య ఆ స్థాయిలో పడిపోతే ఇది సాధ్యం కాదు. ఏది ఏమైనా వర్మ అంచనా ప్రకారం మునుముందు చిత్ర పరిశ్రమకు గడ్డుకాలమే..!