2000 లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ అనతి కాలంలోనే భారీ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన నటించిన నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని వరుస విజయాలను అందుకున్నాయి. కెరీర్ బిగినింగ్ లో భారీ విజయాలతో అందుకున్న ఉదయ్ కిరణ్ కెరీర్ కొన్నాళ్ళకు కూలిపోయింది. ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయి. దీనితో ఉదయ్ కిరణ్ 2014లో తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆయన ఆత్మ హత్యకు కారణం అని అప్పట్లో ప్రముఖంగా వినిపించింది.
ఐతే డబ్బులు లేక ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు అనేది నిజం కాదని అంటున్నారు ఆయన సోదరి శ్రీదేవి. ఉదయ్ కిరణ్ దగ్గర కోట్ల విలువైన ఆస్తులు, బంగారం ఉన్నాయి అన్నారు. ఉదయ్ కిరణ్ మరణం తరువాత ఆ బంగారం, ఆస్తులు ఉదయ్ కిరణ్ భార్య విషిత తీసుకున్నారు అని శ్రీదేవి తెలిపారు. కొన్ని కారణాల వలన తండ్రికి దూరమైన ఉదయ్ కిరణ్ కి భార్యతో సఖ్యత కుదరక మానసిక క్షోభతో ఆయన చనిపోయారని ఆమె పరోక్షంగా చెవుతున్నారు.