అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల వలసలపై ఆయన తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారం రేపింది. ఇక ఇప్పుడు ట్రంప్ టారిఫ్‌లు అంటూ సినిమాలపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. దీంతో సినిమా రంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ట్రంప్ టారిఫ్‌లు అంటూ డొనాల్డ్ ట్రంప్ ఓ వినూత్న సుంకాన్ని ప్రకటించారు. ఇకపై అమెరికాలో కాకుండా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకునే సినిమాలకు 100 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో ఇతర దేశాల ఫిల్మ్ మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయంతో ఇండియన్ సినిమాపై కూడా భారీ ప్రభావం పడనుందని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ముఖ్యంగా ఇప్పటికే విదేశీ చిత్రాలను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఈ నిర్ణయం తీవ్ర కలవరం రేపుతోంది. ముందస్తు డీల్‌తో వారు సినిమాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు వంద శాతం సుంకం కట్టాల్సి వస్తే, ఇది వారికి తీవ్ర నష్టాలను మిగిలిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే విదేశీ సినిమాలను కొనుగోలు చేసిన వారి పరిస్థితి గందరగోళంగా మారింది.
ఇక ట్రంప్ ఎఫెక్ట్ ఇండియన్ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపనుందని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. ఇండియన్ సినిమాలు అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర గతకొన్నేళ్లుగా మంచి ఫలితాలను రాబడుతున్నాయి. అక్కడ భారీ వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమాలు తమ సత్తా చాటాయి. అయితే, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఈ వసూళ్లపై తీవ్రంగా పడనుంది. ఇకపై ఓవర్సీస్ కలెక్షన్స్ రాబట్టడం కష్టమవుతుందని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఓటీటీలపై కూడా ట్రంప్ ప్రకటన ప్రభావం చూపనుంది. ఇప్పటికైతే ఈ సుంకం ఓటీటీలు విధిస్తారా లేదా అనేది పక్కాగా తెలియాల్సి ఉంది. అయితే, ఒకవేళ ఓటీటీలకు కూడా ఈ ట్యాక్స్ విధిస్తే.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ప్లాట్‌ఫామ్‌లు భారతీయ కంటెంట్‌ను తగ్గించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది కూడా ఇండియన్ సినిమాపై తీవ్ర ప్రభావం చూపనుంది.
అయితే, ఈ సుంకాలు విదేశాల్లో షూటింగ్ జరుపుకునే అమెరికన్ సినిమాలకు విధిస్తారా..? పూర్తిగా విదేశాల్లో నిర్మించే సినిమాలకేనా..? వంటి ప్రశ్నలకు ఇంకా స్పష్టత లేదు. ఏదేమైనా ట్రంప్ టారిఫ్ ప్రకటనతో సినిమా రంగం కూడా తీవ్రంగా నష్టపోవడం ఖాయమని.. ముఖ్యంగా ఇండియన్ సినిమాపై ఈ ప్రభావం భారీగా ఉండబోతుందనేది వాస్తవం.