సూపట్ హిట్ సినిమా ‘నువ్వే కావాలి’ ఇవాల్టితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. రెండు దశాబ్దాల క్రితం ఇదేరోజున విడుదలైన ఈ సినిమాను మొదటి రోజు నుండి తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు నీరాజనాలు పట్టారు. మామూలుగా అయితే ఇలాంటి పెద్ద సూపర్ హిట్ సినిమా తీయడానికి దర్శకుడు, రచయిత తలకిందులుగా తపస్సు చేసి ఉంటారని అంతా అనుకుంటారు. అది నిజమే కానీ ‘నువ్వే కావాలి’ సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదట. ఈ సినిమాను తీయడానికి డైరెక్టర్ విజయ భాస్కర్, రచయిత త్రివిక్రమ్ కిందా మీదా పడిపోలేదట. ఆడుతూ పాడుతూ సినిమాను రూపొందించారట.
‘నీరం’ సినిమా ఆధారంగా కథకు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసి ఎంతో స్వేచ్ఛగా సినిమాను తీశామని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. కేవలం 50 రోజుల్లో పూర్తిచేసిన ఈ సినిమా 365 రోజులకు పైగా ఆడిందని, అందుకు కారణం ఆనాడు మేము ఎలాంటి భయం, ఆందోళన, సినిమా ఆడేయలనే తపన లేకుండా హాయిగా తీయడం వలనే జరిగిందని దాని వెనుక నిర్మాతగా రామోజీరావుగారి సపోర్ట్ ఎంతో ఉందని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. తానైతే మాటలు రాయడానికి కేవలం ప్రాసను ఫాలో అయ్యానని, టీమ్ మొత్తాన్ని సరైన దిశలో నడిపింది మాత్రం స్రవంతి రవికిశోర్ గారని, అందుకే సినిమా అంత స్థిరంగా వచ్చిందని, 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ మాట్లాడుకునేలా నిలిచిందని అన్నారు.
ఇక ఈ సినిమాతోనే హీరో తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈ విజయం తర్వాత ఆయన కెరీర్ జెట్ స్పీడ్ అందుకుంది. అలాగే హీరోయిన్ రిచ కూడ తెలుగు పరిశ్రమలో కథానాయకిగా స్థిరపడిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా ఎపుడైనా టీవీల్లో ప్రసారమైతే మంచి టిఆర్పీలు సాధిస్తూ ఉంటుంది. మంచి సినిమా ఎప్పటికీ నిలిచే ఉంటుందనడానికి ‘నువ్వే కావాలి’ ఒక మంచి ఉదాహరణ.