విడుదల తేదీ : ఆగస్టు 29, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ తదితరులు
దర్శకుడు : మోహన్ శ్రీవత్స
నిర్మాత : విజయ్ పాల్ రెడ్డి అడిదల
సంగీతం : ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్
సినిమాటోగ్రఫీ : కుశేందర్ రమేష్ రెడ్డి
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
వర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ టీజర్, ట్రైలర్స్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
సైకియాట్రిస్ట్ డా.శ్యామ్ ఖాతు(సత్యరాజ్) తన మనవరాలు నిధి(మేఘన)తో కలిసి ఉంటాడు. ఓ రోజు నిధి కనిపించకుండా పోతుంది. దీంతో శ్యామ్ ఖాతు పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చేందుకు వెళ్తాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు రామ్(వశిష్ట ఎన్ సింహా). అతడికి పరిచయమైన సత్య(సాంచీ రాయ్)తో ప్రేమలో పడతాడు రామ్. అతడి స్నేహితుడు దేవ్(క్రాంతి కిరణ్) జూదానికి బానిసై అప్పుల పాలవుతారు. వీరిద్దరు కలిసి ఎలాగైనా తమ సమస్యల నుంచి బయటపడాలని చూస్తారు. ఈ ఇద్దరికి నిధి మిస్సింగ్ కేసుకు సంబంధం ఏమిటి..? సత్యరాజ్ తన మనవరాలి ఆచూకీ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు..? ఆయనకు తోడుగా ఎవరు ఉంటారు..? చివరకు ఏం జరుగుతుంది..? అనేది ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
టైటిల్ చూడగానే ఇదేదో సోషియో ఫాంటసీ జోనర్ చిత్రం అనేలా ఉంటుంది. ఈ సినిమాకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సత్యరాజ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్‌లో ఆయన పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. తన మనవరాలి ఆచూకీ కోసం ఆయన పడే తాపత్రయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రామ్ పాత్రలో వశిష్ట సింహా కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ ఈ చిత్ర స్క్రీన్ ప్లే అని చెప్పాలి. సస్పెన్స్ అంశాలను రివీల్ చేసే విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లోని సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఎమోషన్‌తో పాటు సమాజంలో నెలకొన్న ఓ మేజర్ ఇష్యూ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇలాంటి పాయింట్‌ను హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఇక ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఆయువుపట్టుగా క్లైమాక్స్ నిలుస్తుంది. ఈ సినిమాలో కూడా ప్రీ-క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే నిజాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. చక్కటి మెసేజ్‌తో ఈ చిత్రాన్ని ముగించిన తీరు కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎంగేజింగ్ అంశాలు ముఖ్యం. కానీ, ఇందులో అవి చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సస్పెన్స్‌ను రివీల్ చేసేందుకు ఓ బలమైన కథ ఉండాలి. కానీ ఇందులో చాలా రొటీన్ కథను ఎంచుకోవడం మైనస్.
ఇందులో చాలా మంది నోటెడ్ నటీనటులు ఉన్నప్పటికీ, కథలో వారిని పూర్తిగా వినియోగించుకోలేదనిపిస్తుంది. ముఖ్యంగా లేడీ డాన్ పాత్రలో ఉదయభాను ఇంకా సాలిడ్ ఇంపాక్ట్ చూపెట్టాల్సింది. వీటీవీ గణేష్‌ని కూడా పూర్తిగా వినియోగించుకోలేదు.
బార్బరికుడికి సంబంధించిన నేపథ్యాన్ని ఇంకాస్త వివరంగా చూపెట్టాల్సింది. ఇక కామెడీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం మరో మైనస్ అంశం.
సాంకేతిక విభాగం :
దర్శకుడు మోహన్ శ్రీవత్స సమాజంలో నెలకొన్న ఓ సోషల్ అంశాన్ని చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. దీనికి తాత-మనవరాలి ఎమోషన్‌ను యాడ్ చేసి సినిమాను నడిపిన తీరు బాగుంది. అయితే, కొన్ని చోట్ల ఆయన స్క్రీన్‌ప్లే పై ఇంకా ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. పాత్రల డిజైనింగ్ విషయంలోనూ ఆయన ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కుశేంధర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటివ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘త్రిబాణధారి బార్బరిక్’ సోషల్ మెసేజ్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్‌గా పర్వలేదనిపిస్తుంది. సత్యరాజ్ పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే వర్క్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. రొటీన్ కథ, కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని తక్కువ అంచనాలతో చూస్తే బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team