ప్రస్తుతం బాలీవుడ్ మన సినిమాలను రీమేక్ చేసి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఏ సినిమాకైనా ప్రమోషన్స్ చాలా అవసరం, బాలీవుడ్ వాళ్ళు సినిమా ఎలా తీసినా సినిమాని ప్రమోషన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. హిందీ వారు మన సినిమాలను రీమేక్ చేస్తుంటే మన వాళ్ళు వారి ప్రమోషన్ టెక్నిక్స్ ని ఫాలో అవుతున్నారు. మామూలుగా హిందీ సినీ తారలు తమ సినిమా ప్రమోషన్స్ టైంలో బుల్లి తెరపై ప్రసారమయ్యే రియాలిటీ షోలకీ, బాగా ప్రాచుర్యం పొందిన సీరియల్స్ లో కనిపిస్తుంటారు. అలాంటి ప్రమోషన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఊపందుకుంటున్నాయి.
ఈ సంవత్సరం ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన గ్రాఫికల్ మానియా ‘ఈగ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ఈ టీవీలో ప్రసారమయ్యే ‘చంద్రముఖి’ సీరియల్ 1500 వ ఎపిసోడ్ లో కనిపించడమే కాకుండా ఆ ఎపిసోడ్ ని డైరెక్ట్ కూడా చేసాడు. అదే బాటలో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో రానా, డైరెక్టర్ క్రిష్ ‘పుత్తడి బొమ్మ’ సీరియల్ లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేసారు. మామూలుగా మన తెలుగు సినిమాలకు ప్రమోషన్ సరిగ్గా ఉండదని అంటుంటారు, టాలీవుడ్లో ఇలాంటి కొత్త రకమైన ప్రమోషన్స్ రావడం ఆ సినిమాకి ఎంతో శుభసూచకం అని చెప్పుకోవచ్చు.