టాలీవుడ్లో ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ, అందులో సూపర్ హిట్‌గా నిలిచినవి కొన్ని మాత్రమే. స్టార్ క్యాస్టింగ్, భారీ బడ్జెట్ ఇలాంటి అంశాలకంటే కూడా ‘సంగీతం’ అనే పాయింట్‌తోనే ఈ సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. 2025 లో ఇప్పటివరకు 50 సినిమాల వరకు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. కానీ, వినసొంపుగా ఉండే సంగీతం.. ఆకట్టుకునే ట్యూన్స్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్నాయి.
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ దీనికి బెస్ట్ ఉదాహరణ అని చెప్పాలి. ఈ సినిమాలోని పాటలు.. ముఖ్యంగా ‘గోదారి గట్టు మీద’ పాట ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది. సోషల్ మీడియా రీల్స్, ఊళ్లలో స్పీకర్స్ పెట్టుకుని ఈ పాటను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఈ పాట ఒక్కటే ఈ సినిమాపై పాజిటివ్ మౌత్ టాక్‌ను స్ప్రెడ్ అయ్యేలా చేసింది.
ఇక ఆ తర్వాత ‘తండేల్’ సినిమా కూడా ఈ కోవలోకి వస్తుంది. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి లాంటి స్టార్స్ ఉన్నా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వెన్నుముకగా నిలిచింది. ‘బుజ్జితల్లి’ పాటతో ఈ సినిమాకు సాలిడ్ హైప్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల బొమ్మగా నిలిచింది.
ఇటీవల వచ్చిన ‘కోర్ట్’ సినిమా కూడా అంతే. ఇందులోని ‘ప్రేమలో..’ అనే పాట యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ప్రేక్షకులను ఈ పాట థియేటర్ల వరకు లాక్కొచ్చింది. ఇలా సంగీతంతో ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది అనడంలో సందేహం లేదు.
అయితే, బిగ్ హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలు ఎన్ని వచ్చినా.. వాటిలో ఆకట్టుకునే పాటలు, స్కోర్ లేకపోవడంతో ప్రేక్షకులు వాటిని రిజెక్ట్ చేశారు. కేవలం పట్టణాల్లోనే కాకుండా పల్లెటూళ్లలో కూడా ఇదే తీరు కనిపించింది.
ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో చిత్ర టీజర్, ట్రైలర్ కంటే కూడా ఓ మంచి సాంగ్ జనాల్లోకి త్వరగా దూసుకెళ్తుంది. పాట ఆకట్టుకునే విధంగా ఉంటే, ప్రేక్షకులు రిపీటెడ్‌గా వాటిని వింటున్నారు. దీంతో సినిమాపై వారిలో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలు హిట్ కావాలంటే కొత్తగా మ్యూజిక్‌ను కనిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుల నాడి పట్టుకుని, వారు ప్రస్తుతం ఎలాంటి పాటలను ఇష్టపడుతున్నారు, వారికి ఎలాంటి స్కోర్ నచ్చుతుందనే పాయింట్ క్యాచ్ చేసి దానికి అనుగుణంగా సినిమాలో పాటను ఇవ్వగలిగితే, అదే వారి సినిమాకు ప్రమోషన్ చేసి పెడుతుంది. ‘మ్యూజిక్’ బాగుందనే టాక్ స్ప్రెడ్ అయితే ఫలితంలో మ్యాజిక్ జరగడం ఖాయం.