ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి పరిచయమై డైరెక్టర్ గా మారి ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ‘వాంటెడ్’, ‘రౌడీ రాథోర్’ సినిమాలు పెద్ద హిట్స్ కావడంతో చాలామంది నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు ప్రస్తుతం ప్రభుదేవా ‘రాంబో రాజ్ కుమార్’ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా జూలై 19 న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా తెలుగులో హిట్ అయిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకి రీమేక్. ఈ సినిమాలో గిరీష్ కుమార్, శృతి హాసన్, సోనూ సూద్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
నిన్న సాయంత్రం ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాని ప్రమోట్ చెయ్యడానికి గిరీష్, ప్రభుదేవా హైదరాబాద్ కి వచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తో తనకున్న అనుభందం గురించి ప్రభుదేవా మాట్లాడుతూ ‘ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాను అంటే దానికి తెలుగు సినిమాల్లో నా కెరీర్ సక్సెస్ ఫుల్ గా ఉండటమే కారణం. నా ప్రస్థానం ఇక్కడే మొదలైంది అందుకే తెలుగు సినిమా, హైదరాబాద్ నాకు సొంత ఇల్లు లాంటిది. ఒకరోజు కుమార్ తౌరని నన్ను పిలిచి ఓ తెలుగు సినిమా రీమేక్ చేస్తున్నాం మీరు డైరెక్ట్ చెయ్యాలి ఓ సారి ఈ డివిడి చూడమని ఇచ్చారు. అదే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. అది చూసి చెప్పాను సార్ తెలుగులో ఈ సినిమా డైరెక్ట్ చేసింది నేనే అని, వాళ్ళు షాక్ అయ్యారు ఎందుకంటే అప్పటి వరకూ వాళ్లకి తెలియదు ఆ సినిమా చేసింది నేనని, ఆ సంఘటన నేనెప్పటికీ మర్చిపోలేను. నేను వ్యక్తుల మధ్య ఉండే ఎమోషన్స్, రిలేషన్ షిప్స్ నమ్ముతాను, అందుకే ఈ సినిమా హిందీలో కూడా హిట్ అవుతుందని చేసానని’ అన్నాడు. ఈ సినిమా సాంగ్స్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం అందరి కన్ను ఈ సినిమాలో నటించిన గిరీష్, శ్రుత్ హాసన్ పైనే ఉన్నాయి.