ఎల్టీటీటీఈ చీఫ్ వేలుపిళ్లై గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా దక్షిణాదిన అందునా తమిళ ప్రజల్లో ప్రభాకరన్ అంటే ఒక హీరోయిక్ ఇమేజ్ ఉంది. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం గెరిల్లా పోరాటాన్ని నడిపారు ప్రభాకరన్. ప్రభాకరన్ విషయమై తమిళులకు, శ్రీలంకకు ఎప్పుడూ పడదు. లంక పాలకులంటే తమిళ జనాలకు ఎప్పుడూ ఆగ్రహమే. అందుకే విజయ్ సేతుపతి శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ చేయడం కొందరు తమిళులకు నచ్చట్లేదు. నిజానికి మురళీధరన్ తమిళుడే. కానీ ఆయన ప్రభాకరన్ పోరాటానికి మద్దతు ఇవ్వలేదని, కెరీర్ కోసం అక్కడి పాలకులకు అనుగుణంగా నడుచుకున్నారని మండిపడుతూ ఉంటారు. అందుకే తమిళుడే అయినా ఆయన మీద కొంతమందికి కోపం ఉంది.
అదే ఇప్పుడు ‘800’ సినిమాకు, అందులో లీడ్ రోల్ పోషిస్తున్న విజయ్ సేతుపతికి ఇబ్బందికరంగా మారింది. తాజాగా తమిళ లిరిసిస్ట్ తామరై సేతుపతికి బహిరంగ లేఖ రాస్తూ మురళీధరన్ తమిళ ఈలం నినాదానికి మద్దతు ఇవ్వలేదని, అతను కేవలం ఒక క్రికెటర్ మాత్రమే అయితే మీరు ఆ సినిమా చేయడం ఎవరికీ అభ్యంతరకరం కాదు. అతను తమిళులను అణచివేతకు గురిచేసిన సింహళ రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఆ బయోపిక్ వదిలేసి వేలుపిళ్లై ప్రభాకరన్ బయోపిక్ చేయండి. జాతి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. మీలో ప్రభాకరన్ పోలికలు ఉన్నాయి. కావలంటే ఫోటో పంపుతాను. దాన్ని చూస్తూ అద్దం ముందు నిల్చుని ప్రిపరేషన్ మొదలుపెట్టండి అంటూ ప్రభాకరన్ ఫోటోను జతచేశారు.
ఆ ఫోటోలో ప్రభాకరన్, సేతుపతికి చాలా దగ్గరి పోలికలున్నాయి. అది చూసి ఆయన్ను ప్రభాకరన్ బయోపిక్ చేయమని అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ‘800’ మూవీ నిర్మాతలు తమ సినిమాలో ఎలాంటి రాజకీయ కోణం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.