నీకేం కాదు.. భయపడకు’.. అభిమానికి సూపర్ స్టార్ వాయిస్ మెసేజ్


సూపర్ స్టార్ రజనీకాంత్ కు అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 80 ల దశకంలో అభిమానులైతే ఇప్పటికీ రజనీకాంత్ అంటే ప్రాణంగా భావిస్తుంటారు. రజనీ కూడ అంతే.. అభిమానులంటే చాలా ప్రేమగా ఉంటారు. అభిమాని ఎవరైనా కష్టంలో ఉన్నట్టు తన దృష్టికి వస్తే వెంటనే స్పందించి సహాయం చేస్తుంటారు. అలా ఆయన సాయం పొందిన అభిమానులు చాలామందే ఉన్నారు. తాజాగా కూడ ఒక అభిమాని హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకున్న రజనీ స్పందించిన తీరు అద్భుతమనే అనాలి. మురళి అనే సూపర్ స్టార్ అభిమాని కొన్నిరోజులుగా కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కరోనాతో పాటు కిడ్నీల సమస్య తలెత్తడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.

దీంతో మురళి కుమారుడు సోషల్ మీడియాలో ‘రజనీకాంత్ రాజకీయాల్లో గెలవడం చూడకుండానే యుద్దంలో ఓడిపోతున్నాడు’ అంటూ తండ్రి గురించి పోస్ట్ పెట్టాడు. అది వైరల్ అయి రజనీకాంత్ వరకు వెళ్ళింది. వెంటనే వాకబు చేసిన రజనీ మురళికి ఒక వాయిస్ మెసేజ్ పంపారు. అందులో ‘ మురళి… నేను రజనీకాంత్ ను మాట్లాడుతున్నాను. నీకేం కాదు. భయపడకు. ధైర్యంగా ఉండు. నీకోసం దేవుడిని ప్రార్థిస్తాను. త్వరగా కోలుకుని ఇంటికి వచ్చేస్తావ్. నువ్వు కోలుకున్నాక కుటుంబంతో కలిసి మా ఇంటికి రావాలి. నేను నిన్ను చూస్తాను. నమ్మకంగా ఉండు’ అంటూ మాట్లాడారు.

ఇలా రజనీకాంత్ స్వయంగా తన దేవుడిని ప్రార్థిస్తానని అనడం, ధైర్యం చెప్పడంతో మురళి చాలా సంతోషంగా ఉన్నాడట. రజనీ ఇచ్చిన ధైర్యంతో కరోనా, కిడ్నీ సమస్య నుండి కోలుకుంటున్నాడట. ప్రస్తుతం అతని ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇది తెలుసుకున్న అభిమానులు ఒక అభిమాని కష్టంలో ఉంటే రజనీ స్పందించిన తీరు చాలా గొప్పగా ఉందని, నిజంగా తమ హీరో సూపర్ స్టారేనని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే శివ డైరెక్షన్లో రజనీకాంత్ చేస్తున్న ‘అన్నాత్తే’ చిత్రం అక్టోబర్ రెండవ వారంలో రీస్టార్ట్ కానుంది. ఈ షూటింగ్లో రజనీతో పాటు కీలక నటీనటులు పాల్గొననున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

Exit mobile version