విడుదల తేదీ : ఆగస్టు 08, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : షనీల్ గౌతమ్, J. P. తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ తుమినాడ్
దర్శకత్వం : J. P. తుమినాడ్
నిర్మాత : రాజ్ బి. శెట్టి
సంగీతం : సుమేద్ కె, సందీప్ తులసీదాస్
సినిమాటోగ్రఫీ : ఎస్. చంద్రశేఖరన్
ఎడిటింగ్ : నితిన్ శెట్టి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
రీసెంట్ గా కన్నడలో మంచి విజయం సాధించిన చిత్రమే ‘సు ఫ్రమ్ సో’. రాజ్ బి శెట్టి నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయ్యి విడుదలకి వచ్చింది. మరి కన్నడ నేలపై మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి.
కథ:
మర్లూర్ అనే చిన్న గ్రామంలో అశోక్ (జేపీ తుమినాడ్) కి సులోచన అనే దెయ్యం పట్టింది అని ఆ గ్రామస్తులు నమ్మడం మొదలు పెడతారు. దీనితో తన కుటుంబం సహా ఆ గ్రామం మొత్తం సులోచన దెబ్బకు భయం పట్టుకుంటారు. దీనితో ఈ సమస్య నుంచి బయట పడెయ్యడానికి రంగంలోకి రవన్న (శనీల్ గౌతమ్) దిగుతాడు. అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది. తమకి దగ్గర్లోనే ఉన్న సోమేశ్వర గ్రామానికి ఉన్న లింక్ ఏంటి? చివరికి ఆ దయ్యం వదిలిందా లేదా? ఆ దయ్యం ఎవరు? గ్రామస్తులు బయట పడ్డారా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రం తాలూకా ట్రైలర్ చూసినప్పుడే చాలా సహజత్వం కనిపిస్తుంది. ఒక కన్నడ సినిమాలా కాకుండా చాలా రియలిస్టిక్ గా కనిపించే మళయాళ సినిమా షేడ్ లో అనిపిస్తుంది. మరి ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా మొత్తం కూడా ఇదే తరహాలో మంచి క్లీన్ విజువల్స్ తో సహజమైన నరేషన్ తో సాగడం అనేది ఈ తరహా సినిమాలు ఇష్టపడేవారిని మొదటిగా ఎంగేజ్ చేస్తుంది.
అలాగే ఒక చిన్న సెటప్ చేసుకున్న గ్రామంలో అక్కడి మనుషులు వారి నడుమ జెనరేట్ అయ్యే కామెడీ మంచి ఫన్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఈ అంశాలు బాగున్నాయి. రవన్న పాత్రలో శనీల్ గౌతమ్ అదరగొట్టారు. నీట్ పెర్ఫామెన్స్ తో ఎక్కడ ఎంతలా చెయ్యాలో చాలా బాగా చేసి చూపించారు. అలాగే లీడ్ రోల్ అశోక్ ది అయినప్పటికీ రవన్న రోల్ కి స్కోప్ అందులో తాను నటించిన విధానం మరింత మెప్పిస్తుంది.
అలాగే జేపీ తుమినాడ్ తన రోల్ కి మరీ అంత స్పేస్ లేదు కానీ ఉన్నంతలో బాగా చేశారు. కానీ క్లైమాక్స్ పోర్షన్ లో మాత్రం తన రోల్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు బాగా చేశారు. చిన్న పాత్రలో కనిపించిన రాజ్ బి శెట్టి తన పాత్రలో అలరించారు.
మైనస్ పాయింట్స్:
కన్నడలో అంత పెద్ద హిట్ అయ్యిన ఈ సినిమాలో మరీ అంత గొప్ప లైన్ కనిపించలేదు. చాలా సింపుల్ విలేజ్ హారర్ కామెడీ లైన్ తీసుకోగా దానిని పెద్దగా ట్విస్ట్ లు టర్న్ లు లాంటివి లేకుండానే సెట్ చేసుకున్నారు. దీనితో ఒకింత ఎక్కువ ఆశించినవారు డిజప్పాయింట్ కావచ్చు.
అలాగే సినిమాలో కామెడీ బాగానే ఉంది కానీ తెలుగు ఆడియెన్స్ మరీ ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే ఈ తరహా విలేజ్ కామెడీ డ్రామాలు మనం ఇది వరకే చూసాం కాబట్టి ఇది చాలా సింపుల్ గానే అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా మరో సమస్య ఏంటంటే సింపుల్ లైన్ నే తీసుకున్న దర్శకుడు దానిని అదే తరహాలో సోసో గానే నడిపించేసారు.
కథనం ఊహాజనితంగానే సాగుతుంది. వీటితో పాటుగా హారర్ ఎలిమెంట్స్ కూడా అంత థ్రిల్ కలిగించేలా లేవు. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అలాగే దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుండేది.
ఇక వీటితో పాటుగా అశోక్ రోల్ ఒక సమయం తర్వాత సైడ్ అయ్యిపోయినట్టు అనిపిస్తుంది. మొత్తం రవన్న సైడ్ తీసుకుంది. ఇక్కడ కూడా మిస్ ఫైర్ జరిగింది. ఇంకా అనేక పాత్రలు అలా వస్తూనే ఉంటాయి. కథనంలో ఇన్ని పాత్రలు అనవసరం.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయని చెప్పాలి. మంచి విలేజ్ సెటప్ ని చేసుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మంచి కెమెరా వర్క్ ఎస్ చంద్రశేఖరన్ అందించారు. అలాగే సందీప్ తులసీదాస్ సంగీతం బాగుంది. నితిన్ శెట్టి ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. ఫస్టాఫ్ లో స్లో సీన్స్ తగ్గించాల్సింది. ఇక తెలుగు డబ్బింగ్ డీసెంట్ గా ఉంది.
ఇక దర్శకుడు జేపీకి తన మైండ్ లో మంచి ఉద్దేశమే పెట్టుకున్నారు అలాగే హారర్ బ్యాక్ డ్రాప్ లో ఒక సందేశాన్ని చెప్పాలనుకున్నారు కానీ దానిని తెరకెక్కించడంలో మాత్రం ఇంకా జాగ్రత్తలు వహించాల్సింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే పరంగా దృష్టి సారించాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘సు ఫ్రమ్ సో’ చిత్రం ఓ రొటీన్ హారర్ కామెడీ సినిమా అని చెప్పాలి. ఒక డీసెంట్ సందేశాన్ని మంచి కామెడీ ఇంకా హారర్ ఎలిమెంట్స్ తో చెప్పాలనుకున్న ప్రయత్నం ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్, సినిమాలో నాచురల్ సెటప్ ఇంప్రెస్ చేస్తాయి. కానీ ఓవరాల్ ఏదో మిస్ అవుతున్న అసంతృప్తి మాత్రం ఉండిపోతుంది. సో వీటితో తక్కువ అంచనాలు పెట్టుకుంటే మంచిది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team