స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి పుట్టినరోజు నేడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి వంశీ పైడిపల్లితో మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. కాగా మహేష్ బాబు, వంశీ సన్నిహితులతో పాటు తన కుటుంబ సభ్యులతో సహా నిన్న రాత్రి వంశీ పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. దానికి సంబంధించి మహేష్ ఈ ఉదయం తన ఇన్స్టాగ్రామ్లో వంశీకి కేక్ తినిపిస్తున్న ఫోటోను పోస్టు చేస్తూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు వంశీ. మీరు ఎప్పటిలాగే నవ్వుతూ ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ మీకు మంచి ఆరోగ్యం, ఆనందం మరియు ప్రేమ కలగాలని కోరుకుంటున్నాను” అని మహేష్ పోస్ట్ చేశారు.
కాగా వంశీ, మహేష్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. పైగా ‘మహర్షి’ ప్రతి ఒక్కరికీ మంచి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చే సినిమా అని ప్రముఖుల చేత ప్రశంసలు కూడా పొందింది. అయితే ఆ తరువాత వీరిద్దరూ చేయాలనుకున్న సినిమాకి స్క్రిప్ట్ సెట్ కాక చివరికీ సినిమానే ఆగిపోయింది. కానీ భవిష్యత్తులో మాత్రం వీరి నుండి మరో సినిమా కచ్చితంగా రాబోతుందట.