ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్నేహ ఇటీవలే ప్రసన్న అనే తమిళ నటున్ని పెళ్లి చేసుకుని సినిమాలకి దూరంగా ఉంది. స్నేహ చివరిగా తెరపై కనిపించిన సినిమా ‘రాజన్న’. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఉలవచారు.. బిర్యాని’ సినిమాతో మళ్ళీ స్నేహ తెరపై కనిపించనుంది. మలయాళంలో వచ్చిన ‘ సాల్ట్ అండ్ పెప్పర్’ అనే సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో నాలుగు ప్రధాన పాత్రలుంటాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్, టబు ఎంపిక కాగా ఇప్పుడు మరొక ప్రధాన పాత్రకి స్నేహని ఎంచుకున్నారు, మరొక కీలక పాత్ర కోసం మరో నటున్ని ఎంచుకోవాల్సి ఉంది. ప్రకాష్ రాజ్ డైరెక్ట్ చేస్తున్న రెండవ సినిమా ఇది, అలాగే ఈ సినిమాని తెలుగు, హిందీ తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్న ఈ సినిమా 2013 ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ‘లవ్ ఈజ్ కుకింగ్’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక.