పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘హ్రీం’ ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి రాజేశ్ రావూరి దర్శకత్వం వహించనుండగా, శివమ్ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పణలో శివ మల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవంలో ప్రముఖ హీరో సందీప్ కిషన్ క్లాప్ కొట్టగా, నటులు అలీ, బెనర్జీ, ప్రముఖ ఆడిటర్ విజయేంద్ర రెడ్డి, రాంబాబు పర్వతనేని దర్శకుడు రాజేశ్‌కు స్క్రిప్ట్ అందించారు. రాజీవ్ కనకాల కెమెరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ, ‘‘నా తొలి చిత్రం నుంచే శివ మల్లాలతో మంచి పరిచయం ఉంది. ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. అలీ మాట్లాడుతూ, ‘‘శివ మల్లాల, సుజాతలు నాకు కుటుంబ సభ్యుల్లాంటివారు. వారి సినిమా విజయం సాధించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా’’ అన్నారు. బెనర్జీ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాలో నాకు మంచి పాత్ర దక్కింది. శివ నాకు సన్నిహితుడు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ, ‘‘ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాను. హీరోయిన్ చమిందా వర్మ నటనతో పాటు డాక్టర్ కూడా. ఆమె దుబాయ్ నుంచి తెలుగు సినిమాల్లో నటించేందుకు వచ్చారు. పవన్ తాత, దర్శకుడు రాజేశ్ ఇద్దరూ నాకు పరిచయమే. శివ మల్లాల నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.