‘ఎలా చెప్పను’ సినిమాలో ఓ కీలక పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ బాలాజీ ఆ తర్వాత చేసిన ‘ఆర్య’, ‘సంక్రాంతి’, ‘చందమామ’, ‘శంభో శివ శంభో’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రోజు శివ బాలాజీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అయన మీడియాతో ముచ్చటించారు.
ఈ మధ్య కాలంలో సినిమాలకు మాగా ఎక్కువ గ్యాప్ ఇస్తున్నారు ఎందుకలా అని అడిగితే ‘ మాములుగా నా దగ్గరకు వచ్చే సినిమాలే తక్కువగా ఉంటాయి. అందులో కొన్ని మంచి కథలనే ఎంచుకోవాలి. గతంలో వచ్చిన సినిమాలన్నీ చేసేసి చాలా నష్టపోయాను అందుకే మళ్ళీ అలా జరగకూడదని సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నాను. చేతిలో దమ్ములేని సినిమాలు పది ఉండడం కంటే మంచి సినిమా ఒక్కటున్నా చాలని’ శివ బాలాజీ అన్నాడు.
అలాగే ‘ ఎస్ ఎస్ రాజమౌళి గారి సినిమాలో ఒక్క చిన్న పాత్రైనా చెయ్యాలని కోరుకుంటున్నానని’ తన మనసులోని కోరికని బయటపెట్టాడు. త్వరలోనే శివ బాలాజీ కోరిక నెరవేరాలని కోరుకుందాం. ప్రస్తుతం శివ బాలాజీ ‘జెండా పై కపిరాజు’, ‘జగమే మాయ’ సినిమాలు చేస్తున్నాడు.