ఆమెకి ఇలాంటి సినిమా ఇచ్చినందుకు గర్వంగా ఉంది – శేఖర్ కమ్ముల

ఆమెకి ఇలాంటి సినిమా ఇచ్చినందుకు గర్వంగా ఉంది – శేఖర్ కమ్ముల

Published on Jan 30, 2014 4:00 PM IST

Anamika
సున్నితమైన కథాంశాలతో సినిమాలు తెరెకెక్కించే శేఖర్ కమ్ముల ఈ సారి కాస్త రూటు మరియు జోనర్ మార్చి చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘అనామిక’. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో వైభవ్, హర్ష వర్ధన్ రానే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ సినిమాక్స్ లో లాంచ్ చేసారు.

ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘నా జోనర్ నుంచి బయటకి వచ్చి సినిమా చెయ్యాలి అని కథ కోసం తిరుగుతున్న సమయంలో ఈ చిత్ర నిర్మాతలు ఈ కథతో నా ముందుకు వచ్చారు. నాకు నచ్చింది అలాగే అప్పటి నిర్భయ, దిల్ సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ ల వల్ల నేను కూడా ఈ మూవీ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నేను యండమూరి వీరేంద్రనాథ్ గారు కలిసి సుమారు 4-5 నెలలు కథ తయారు చేసాం. రెండు భాషల్లో తీసిన ఈ సినిమాని కేవలం 55 రోజుల్లో పూర్తి చేసాం. అందరూ ఇది రీమేక్ అంటున్నారు. కానీ మేము సినిమాలో ప్లాట్ ని మాత్రమే తీసుకొని చాలా మార్పులు చేసాం. ఈ సినిమాతో మొదటి సారి సిరివెన్నెల సీతారామశాస్త్రి, కీరవాణి లాంటి సీనియర్ టెక్నీషియన్స్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు.

అనామికలో నయనతార ప్రెగ్నెన్సీ లేని లేడీలా చూపించారు. ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందంటారా? అని అడిగితే ‘ ముందుగా చెప్పినట్టు కథలో చాలా మార్పులు చేసాం అందుకే ప్రెగ్నెన్సీ లేడీ అనే కాన్సెప్ట్ తీసేసాం. ఇక కనెక్ట్ అవుతుందా లేదా అనేది మీరే చూసి చెప్పాలని’ శేఖర్ కమ్ముల సమాధానం ఇచ్చాడు.

మొదటి సారి సీనియర్ హీరోయిన్ నయనతారతో కలిసి పనిచేయడం ఎలా ఉంది? ఏమన్నా లోనయ్యారా అని అడిగితే ‘తనతో పనిచేయడం ఒత్తిడిగా ఏం ఫీలవ్వలేదు. మొదటి సారి సీనియర్ మరియు క్రేజ్ ఉన్న వాళ్ళతో చేయడం వల్ల కొన్ని నేర్చుకున్నాను. నయనతార చాలా బాగా చేసింది. నా వరకూ మాత్రం తనకి ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉందని’ శేఖర్ కమ్ముల అన్నాడు.

మీ సొంత కథ కాకుండా మొదటి సారి వేరే వాళ్ళ కథని తీసుకొని చేసారు. ఈ రెండిటిలో ఏది మీకు ఏది కంఫర్టబుల్ అని అడిగితే ‘నా సొంత కథ నటే నా సొంత కూతురు లాంటిది. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రీమేక్ కథలు అంటే దత్త పుత్రిక లాంటిది. ఎప్పటికైనా సొంత కథల్లోనే కంఫర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పాత్రని నేను నా సొంతం అనుకొని డిజైన్ చేసుకుంటానని’ శేఖర్ కమ్ముల అన్నాడు.

తాజా వార్తలు