డైరెక్షన్ ఒకరి దగ్గర నేర్చుకుంటే వచ్చేది కాదు – సాజిద్ ఖురేషి

pustakamlo konni pejeelu missing  (16)

‘ఈ రోజుల్లో’ సినిమాతో తెలుగువారికి పరిచయమైన శ్రీ హీరోగా, నూతన దర్శకుడు సాజిద్ ఖురేషి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’. ఈ సినిమా తమిళ్లో హిట్ అయిన ‘నడువుల కొంజెం పక్కతు కానోం’సినిమాకి రీమేక్. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఆగష్టు లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర హీరో శ్రీ, డైరెక్టర్ సాజిద్ ఖురేషి మీడియా మిత్రులతో కాసేపు ముచ్చటించారు.

శ్రీ మాట్లాడుతూ ‘ నేను ఆడియో ఫంక్షన్ లోనే ఈ ఆల్బంలో రెండు పాటలు హిట్స్ అవుతాయని చెప్పాను. అలాగే ఆ రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియోని పెద్ద హిట్ చేసిన వారికి నా ధన్యవాదాలు. సినిమాని కూడా హిట్ చేస్తారని ఆశిస్తున్నాను’.

డైరెక్టర్ సాజిద్ ఖురేసి ఈ మూవీ టైటిల్ గురించి మాట్లాడుతూ ‘ మొదట్లో ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ టైటిల్ ఏంటి అంత క్యాచీ గా లేదని అన్నారు కానీ ఆ తర్వాత నా ఫ్రెండ్స్ తో పాటు అందరూ ఆ టైటిల్ పై నా మెమరీలో కొన్ని పేజీలు మిస్ అయ్యాయిరా అంటూ జోక్స్ వేస్తున్నారు. దీన్నిబట్టి నేను అనుకున్న టైటిల్ జనాల్లో బాగా రీచ్ అయ్యిందని అనుకుంటున్నానని’ అన్నాడు.

ఇది రీమేక్ సినిమా కావున అందులోని మార్పులు చేర్పుల గురించి చెబుతూ ‘ తమిళ్ వెర్షన్ తో పోల్చుకుంటే తెలుగు వెర్షన్ లో 40% మార్చాను. కానీ ఫీల్ మాత్రం అలానే ఉంటుంది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయి కానీ తమిళ్లో ఒకే ఒక్క సాంగ్ ఉంటుంది. ఈ వార్త విన్న ఈ చిత్ర తమిళ్ వెర్షన్ డైరెక్టర్ బాలాజీ షాక్ అయ్యారు. మేము పాటలు పెట్టడానికి వీలులేదని ఒకే ఒక్క పాటని పెట్టాము కానీ నువ్వెలా 5 పాటలు పెట్టావని అడిగారు. అలాగే ఆయన కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని’ అన్నాడు.

ఈ కొత్త డైరెక్టర్ డైరెక్షన్ గురించి చెబుతూ ‘ నేను బొంబాయిలో కొంతమంది దర్శకుల దగ్గర పనిచేసాను. నేను ఎప్పుడూ ఒకరి దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలనుకోలేదు ఎందుకంటే డైరెక్షన్ అనేది ఒకరి దాగ్గర నేర్చుకునేది కాదు, అలాగే ఒకరు నేర్పితే వచ్చేది కాదు. మనం ఫీల్ అయిన దాన్ని, మనం అనుకున్న విజువల్ ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ పైన ప్రొజెక్ట్ చెయ్యగలిగితే చాలని’ అన్నాడు.

తన కెరీర్ గురించి చెబుతూ ‘ నేను తెలుగు తమిళ్, మళయాళ సినిమాలను హిందీలోకి డబ్ చేసేవాన్ని. ఇలా సుమారు 200 వందల సినిమాలు చేసాను. నేను మొట్ట మొదటగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిర్మించిన ‘అంజి’ సినిమాని డబ్ చేసి హిందీలో రిలీజ్ చేసాను. నాకు మొదటి నుంచి డైరెక్షన్ అంటే ఇష్టం అందుకే ఇటువైపుకి వచ్చాను. ఫ్యామిలీ మొత్తం చూడదగిన సినిమాలే చేస్తానని’ అన్నాడు.

ఈ సినిమా షూటింగ్ టైంలో గానీ ట్రైలర్స్ రిలీజ్ అయిన తర్వాత గానీ మా కొచ్చిన కాంప్లిమెంట్స్ ఏమిటని అడిగితే ‘ నాకు ఇది వరకూ ఒక్క కాంప్లిమెంట్ కూడా రాలేదు కానీ నా సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో శ్రీ కి మాత్రం మంచి ప్రశంశలు దక్కాయని’ అన్నాడు.

చివరిగా తను తదుపరి చేయబోయే సినిమాల గురించి చెబుతూ ‘ నేను తదుపరి చెయ్ సినిమాకి నేనే ఓ కథని రాసుకున్నాను. అందులో నెగటివ్ పాత్ర చేయడానికి పార్థిబన్ అంగీకరించారు. హీరో పాత్ర కోసం అర్జున్ మరియు శరత్ కుమార్ లను సంప్రదిస్తున్నాను. ఆ సినిమాకి ‘ప్రవేశం’ అనే టైటిల్ ఖారారు చేసాం. సెప్టెంబర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ మొదలు పెట్టనున్న ఆ సినిమాని తెలుగు – తమిళ భాషల్లో నిర్మించనున్నామని’ తెలిపారు.

Exit mobile version